- వ్యవసాయరంగాన్నికార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కుట్ర
- ‘అఖిల భారత కిసాన్ సంఘర్ష్’ కమిటీ బహిరంగ సభలో నేతలు
- వామపక్షాలు, రైతుల సంఘాల ఆధ్వర్యంలో జాతా
- సరూర్ నగర్ స్టేడియం నుంచి ఉప్పల్ చౌరస్తా వరకు భారీర్యాలీ
సారథి న్యూస్, హైదరాబాద్: దేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వామపక్ష పార్టీల నేతలు, రైతు సంఘాల నాయకులు ఆక్షేపించారు. వ్యవసాయ చట్టాలను చర్చించి ప్రత్యేక చట్టాలు రూపొందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఢిల్లీకి వెళ్లొచ్చిన తర్వాత వ్యవసాయ చట్టాలపై సీఎం కేసీఆర్ యూ టర్న్ తీసుకున్నారని విమర్శించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతు సంఘాలు చేస్తున్న దీక్షకు మద్దతుగా మంగళవారం హైదారాబాద్ లో అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం నుంచి ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వరకు భారీర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉప్పల్ చౌరస్తాలో నిర్వహించిన బహిరంగ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. వ్యవసాయ చట్టాలను పంజాబ్, హర్యానా రైతులే వ్యతిరేకిస్తున్నారని.. చాలా రాష్ట్రాల్లో రైతుల మద్దతు లభిస్తోందని వాదన చేస్తున్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం రైతాంగానికి, 140 కోట్ల మంది ఆహారభద్రతకు చిల్లు పెట్టిందన్నారు. దేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్రం కుట్రపన్నుతోందన్నారు. కేంద్రం నియంతపోకడల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మొదట్లో వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన సీఎం కేసీఆర్, ఢిల్లీకి వెళ్లొచ్చిన తర్వాత మద్దతు పలకడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు.
సీఎం కేసీఆర్.. ప్రధాని మోడీ జపం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఢిల్లీకి వెళ్లొచ్చిన తర్వాత యూ టర్న్ తీసుకున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ రైతు రుణమాఫీ చేస్తానని మాట మరిచి ఎవరి పక్షాన పనిచేస్తున్నారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ప్రధాని మోడీ జపం చేస్తున్నారని విమర్శించారు.
కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలకడం కాదు..
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. దేశంలో రైతులను హక్కులను అణచివేస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయమంటే కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలకడం కాదన్నారు. కార్పొరేట్ కంపెనీలకు మేలుచేసే వ్యవసాయ రంగం ముందుకు రాదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని కోరారు. నకిలీ సీడ్స్ కంపెనీలు, దళారుల నుంచి రైతులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
సరూర్నగర్ టు ఉప్పల్ భారీర్యాలీ
సరూర్ నగర్ స్టేడియం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ ఎల్బీనగర్, కామినేని ఆస్పత్రి, నాగోల్, ఉప్పల్ చౌరస్తా మీదుగా రాజీవ్ గాంధీ స్టేడియం వరకు సాగింది. ఈ ర్యాలీకి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ర్యాలీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యేలు పల్లా వెంకట్ రెడ్డి, నంధ్యాల నర్సింహారెడ్డి, పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ర్యాలీలో అగ్రభాగాన నిలిచారు.