- నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హర్షం
సారథి ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని ఐదు గ్రామాలు, 17 గిరిజన తండాలకు సాగునీరు అందించే మార్కండేయ లిఫ్ట్ నిర్మాణానికి రూ.76.92 కోట్ల నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీవో నం.211 విడుదల చేసింది. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. బిజినేపల్లి మండలంలోని గంగారం, సాయిన్ పల్లి, మమ్మాయిపల్లి, సాయిన్ పల్లి, లట్టుపల్లితో పాటు 17 గిరిజన తండాల్లో సుమారు 8వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. సీఎం కె.చంద్రశేఖర్ రావు 2018 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు మార్కండేయ లిఫ్ట్ నిర్మాణానికి నిధులు విడుదల చేస్తూ పరిపాలన అనుమతులు జారీచేయడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. ఈ లిఫ్ట్ నిర్మాణం ద్వారా బిజినేపల్లి మండలం మొత్తం పూర్తిగా సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. నిధులు మంజూరు చేసినందుకు బిజినేపల్లి మండల రైతాంగం తరఫున సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.