- పార్లమెంట్లో లేవనెత్తుతాం: ఎంపీ ఉత్తమ్
- రాహుల్ మద్దతు ఇచ్చారన్న మధుయాష్కీ
- వర్గీకరణ చేయకపోతే బీజేపీ తిరగనియ్యం
- ఎస్ఎఫ్ సదస్సులో మందకృష్ణ మాదిగ
న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ ఎప్పుడు వెనకడుగు వేయలేదన్నారు. వర్గీకరణ కోసం తన జీవితాన్ని మందకృష్ణ మాదిగ అంకితం చేశారని కొనియాడారు. ఎస్సీ వర్గీకరణ గళాన్ని పార్లమెంట్ లో లెవనెత్తుతామన్నారు. ఇది న్యాయమైన డిమాండ్ అని అన్నారు. అందరికీ న్యాయం జరగాలంటే వర్గీకరణ జరగాలన్నారు. ఎంత త్వరగా జరిగితే అంత మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకు తనవంతుగా పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. గతంలోనే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మద్దతు తెలిపారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మందకృష్ణ మాదిగ సహాయాన్ని కేసీఆర్ తీసుకున్నారని అన్నారు. ఇప్పుడు అదే మందకృష్ణ మాదిగను జైల్లో పెట్టించిన చరిత్ర కేసీఆర్ దేనని గుర్తుచేశారు. యావత్తు తెలంగాణ కల్వకుంట్ల కుటుంబ దోపిడీకి గురవుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర కీలకమన్నారు. యూపీఏ ప్రభుత్వ కాలంలో వర్గీకరణ చేయలేకపోయామన్నారు. బీజేపీ కూడా వర్గీకరణ అంశంలో మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు. వర్గీకరణ కోసం 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణమాదిగ అన్నారు. జాతీయ స్థాయిలో ఎస్సీ వర్గీకరణ చేయకపోతే బీజేపీ నేతలను తెలంగాణ, ఏపీలో తిరగనివ్వబోమని ఆయన ప్రకటించారు. గతంలో యూపీఏ హయాంలో వర్గీకరణ కోసం ప్రయత్నాలు చేసిందన్నారు. ప్రస్తుతం బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడేళ్లయినా ఇప్పటివరకు వర్గీకరణ చేయలేదని ఆయన ఆరోపించారు.