Breaking News

ప్రేమను గెలిపించుకోవడానికి యువతి పోరాటం

  • ప్రియుడి ఇంటి ముందు ధర్నా
  • ఎంగేజ్ మెంట్ అయ్యాక పెళ్లి చేసుకునేందుకు నిరాకరణ

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: ఇద్దరూ ప్రాణంగా ప్రాణంగా ప్రేమించుకున్నారు..ఏడడుగులు వేసి ఒక్కటై అన్యోన్యంగా ఉందామనుకున్నారు. పెద్దలను ఒప్పించి ఎంగేజ్ మెంట్ సైతం చేసుకున్నారు. ఏమైందో తెలియదు ప్రేమించిన వ్యక్తి ఒక్కసారిగా దూరం పెట్టాడు.. పెళ్లి చేసుకుంటానన్న వారి మాటలు కల్లలయ్యాయి. కన్నీళ్లే శరణ్యమయ్యాయి. వెరసి ఆ యువతి తన ప్రేమను ఎలాగైనా గెలిపించుకోవాలన్న తపనతో ఏకంగా ప్రియుడి ఇంటిముందే ధర్నాకు దిగింది. వివరాలు ఇలా.. బిజినేపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన బురానుద్దీన్ (42), జట్పోల్ కు చెందిన రిజ్వానా బేగం (37) ఇద్దరు నాలుగేళ్ల క్రితం నుంచి ప్రేమించుకొని 2020లో పెద్దల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అప్పటినుంచి ఇద్దరు వృత్తిరీత్యా రిజ్వానా బేగం కొల్లాపూర్ లోని కస్తూర్బా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తుంది. బురానుద్దీన్ నాగర్ కర్నూల్ లోని ఓ ప్రైవేటు కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్ గా పని చేస్తున్నాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఏమైందో తెలియదు వీరిద్దరి మధ్యా మనస్పర్థలు వచ్చాయి.

కొద్దిరోజులుగా రిజ్వానాతో అతడు మాట్లాడట్లేదు. దీంతో పెళ్లి చేసుకుందామని బురానుద్దీన్ ను అడిగింది. తన చెల్లెలు వివాహం అయ్యాక చేసుకుంటానని చెప్తూ కాలయాపన చేశాడు. తనకు మోసం జరుగుతోందని పసిగట్టిన రిజ్వానా వెంటనే నాగర్ కర్నూల్ లోని ఐద్వా మహిళా సంఘం నాయకురాలు కందికొండ గీత, దళిత సంఘాల నేతలకు తన గోడు వెల్లబోసుకుంది. అంతేగాక పది రోజుల క్రితం నుండి ప్రియుడు బురానుద్దీన్ ఇంటి ముందు వచ్చి ధర్నా చేస్తోంది. ఈ విషయం తెలిసిన స్థానిక ఎంపీపీ, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కొంతమంది పెద్ద మనుషులు కలిసి రెండు రోజులు సమయం ఇస్తే న్యాయం చేస్తామని చెప్పడంతో రిజ్వానా తిరిగి ఆమె ఇంటికి వెళ్ళిపోయింది . రెండు రోజుల తర్వాత కూడా ఆమెకు న్యాయం జరగకపోవడంతో ప్రియుడి ఇంటి ముందు వచ్చి మళ్లీ ధర్నాకు దిగింది. ఐద్వా నాయకురాలు కందికొండ గీతతో కలిసి ప్రియుడి ఇంట్లోనే తమకు పెళ్లి జరగాలని.. లేదంటే పురుగుల మందు తాగి ఇక్కడే చనిపోతానని అక్కడే కూర్చొంది. గ్రామస్థులు, సంఘాల తోడు ఉన్నా.. న్యాయం జరగట్లేదని తమ పెళ్లి చేయకపోతే పోరాటం ఆపబోనని ఆమె చెబుతోంది.