Breaking News

బీసీలకు 70 సీట్లు

బీసీలకు 70 సీట్లు

  • బీఆర్​ఎస్​, కేసీఆర్​ దోపిడీ పాలనను కూల్చుతాం
  • గృహలక్ష్మి పథకం అమలును కలెక్టర్లకు అప్పగించాలి
  • సర్దార్ సర్వాయిపాపన్న 373వ జయంతి వేడుకల్లో బీఎస్పీ స్టేట్​ చీఫ్​ డాక్టర్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​

సామాజికసారథి, కాగజ్​ నగర్​: వచ్చే ఎన్నికల్లో బీసీలకు 70 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తామని బీఎస్పీ స్టేట్​ చీఫ్​ డాక్టర్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ స్పష్టంచేశారు. దమ్ముంటే రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీలు బీసీలకు 70 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. బీఎస్పీ అన్నివర్గాలను కలుపుకుని ముందుకెళ్తుందని అన్నారు. శుక్రవారం కాగజ్ నగర్ లో సర్దార్ సర్వాయి పాపన్న 373వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్దార్ పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గోల్కొండ కోటను ఆక్రమించి బహుజన పాలన సాగించిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్​ స్ఫూర్తితో తెలంగాణలో బహుజన రాజ్యాధికారం సాధిస్తామని అన్నారు. అన్ని కులాలు, మతాలను కలుపుకుని గోల్కొండ కోటను ఆక్రమించిన సర్వాయిపాపన్న స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో బహుజనులందరూ రాజకీయంగా ఒక్కటై కేసీఆర్ దోపిడీ పాలనను కూల్చాలన్నారు. పాపన్న బహుజనుల ఆత్మగౌరవ పోరాటానికి స్ఫూర్తి అన్నారు. గృహలక్ష్మి లబ్ధిదారుల ఎంపికలో జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇవ్వకుండా మంత్రుల జోక్యం ఎందుకని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పేదల ఇళ్లనిర్మాణానికి ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంలో మంత్రులు, ఎమ్మెల్యేల రాజకీయ జోక్యంతో అర్హులైన పేదలకు న్యాయం జరగదన్నారు. దరఖాస్తులు తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్లకు ఉన్నప్పుడు, ఇండ్లు మంజూరు చేసే అధికారం మంత్రులకు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. తక్షణమే గృహలక్ష్మి లబ్ధిదారుల ఎంపికను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గృహలక్ష్మీ పేరుతో వచ్చే ఎన్నికల్లో పేద ప్రజలను మభ్యపెట్టి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం సీఎం కేసీఆర్ చేస్తున్నారని విమర్శించారు. పెరిగిన సిమెంట్, ఇసుక, ఐరన్ ధరలకు ప్రభుత్వం ఇచ్చే రూ.3లక్షలు సరిపోవన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబసర్వే ప్రకారం ఇండ్లులేని పేదలకు రూ.18వేల కోట్లతో 2.72 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తానని ప్రగల్భాలు పలికిన సీఎం కేసీఆర్, గత తొమ్మిది ఏళ్లలో కేవలం 50వేల ఇండ్లు మాత్రమే పూర్తిచేశారని విమర్శించారు. గృహలక్ష్మి దరఖాస్తుకు రేషన్ కార్డు తప్పనిసరి చేయడాన్ని తప్పుబట్టారు. తొమ్మిది ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఎందుకు జారీచేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 9ఏళ్ల కాలంలో లక్షల మంది కొత్తగా పెళ్లి చేసుకుని నూతన కుటుంబ వ్యవస్థగా ఏర్పడ్డారని అన్నారు. వారికి కొత్త రేషన్ కార్డు ఇవ్వకుండా గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉండాలని నిబంధన పెట్టడం సమంజసం కాదన్నారు. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి అర్షద్ హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి సిడెం గణపతి, మాజీ జెడ్పీటీసీ పిల్లల తిరుపతి, సీతానగర్ ఎంపీటీసీ జామున మహేశ్​, కంబలె గౌతం, సెక్టర్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, షాకీర్, శోభన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.