- క్యాథ్ ల్యాబ్, సీటీ స్కాన్ సేవలను ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు
సామాజికసారథి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలో 50 పడకల ఐసీయూ నిర్మాణంలో ఉందని, దీన్ని రెండు నెలల్లోనే ప్రారంభిస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అలాగే టెస్టులను వెంటనే ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉస్మానియా ఆస్పత్రిలో సీటీ స్కాన్, క్యాథ్ ల్యాబ్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.ఏడుకోట్లతో క్యాథ్ ల్యాబ్, రూ.రెండుకోట్ల 12 లక్షలతో సీటీ స్కాన్‌ను ప్రారంభించామని తెలిపారు. ఉస్మానియాలో ఉన్న 180 వెంటిలేటర్లలో 102 వెంటిలేటర్లు మాత్రమే పని చేస్తున్నాయి. మిగతా వాటికి మరమ్మతు చేయాలని ఆదేశించారు. ఉస్మానియాలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు. జనవరి1న మళ్లీ ఉస్మానియాలో పర్యటిస్తానని చెప్పారు. ఉస్మానియాకు ఎన్‌ఏబీసీ అక్రిడిటేషన్ కోసం కేంద్రానికి ప్రతిపాదన పంపుతామన్నారు. ఉస్మానియా నూతన బిల్డింగ్‌పై కోర్టు కేసు తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఖమ్మంలో వారం పదిరోజుల్లో క్యాథ్ ల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని హరీశ్‌రావు తెలిపారు. ఆదిలాబాద్ రిమ్స్, గాంధీ ఆస్పత్రిలో, వరంగల్‌లో కూడా క్యాథ్ ల్యాబ్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గుండె జబ్బు రోగులకు ప్రభుత్వ రంగంలోనే నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. అగ్నిమాపక యంత్రం, ఆక్సిజన్ ప్లాంట్‌ను కూడా ప్రారంభించారు. ఓపీ స్లిప్పుల జారీ కేంద్రం పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రి వెంట స్థానిక నాయకులు, అధికారులు ఉన్నారు.