- జనవరి 5న తుది ఓటరు జాబితా
- ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర
లక్నో: వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకే కేంద్ర ఎన్నికల సంఘం మొగ్గుచూపింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను సమీక్షించేందుకు గురువారం లక్నోకు వచ్చిన ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్‌చంద్ర స్పష్టత ఇచ్చారు. షెడ్యూలు ప్రకారమే ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. అన్ని రాజకీయపార్టీలు కొవిడ్ ప్రొటోకాల్‌ను అనుసరించి సకాలంలో ఎన్నికలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జనవరి 5న తుది ఓటరు జాబితా వస్తుందని తెలిపారు. ఓటరు జాబితా తుది ప్రచురణకు సంబంధించి జనవరి 5 తర్వాత ఏదైనా ఫిర్యాదువస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. దీంతో వచ్చే వారమే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 80 ఏళ్లు పైబడినవారు, వికలాంగులు, కరోనా సోకిన వారు పోలింగ్ కేంద్రానికి రాలేని వారి ఇంటి వద్దకే ఎన్నికల సంఘం చేరుకుంటుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర తెలిపారు. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్‌లో మొత్తం ఓటర్లు 15 కోట్ల మంది ఉన్నారని తెలిపారు. తుది ప్రచురణ తర్వాత అసలు ఓటర్ల గణాంకాలు వస్తాయన్నారు. చివరి ప్రచురణ తర్వాత కూడా ఎవరి పేరు రాకపోతే క్లెయిమ్ చేసుకోవచ్చన్నారు. ఇప్పటి వరకు 52.8 లక్షల మంది కొత్త ఓటర్లు చేరారని తెలిపారు. వీరిలో 23.92 లక్షల మంది పురుష ఓటర్లు, 28.86 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారని తెలిపారు. 18–19 ఏళ్ల మధ్య 19.89 లక్షల మంది ఓటర్లు ఉన్నారని సుశీల్ చంద్ర వివరించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల నిర్వహణపై అన్ని రాజకీయ పార్టీలతో సమావేశమయ్యామని తెలిపారు. ఎన్నికల ప్రచారర్యాలీల్లో విద్వేషపూరిత ప్రసంగాలు, జనం రావడంపై కొన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. పోలింగ్ బూత్‌ల వద్ద తగిన సంఖ్యలో మహిళా బూత్ వర్కర్లను కూడా నియమించాలని డిమాండ్ చేశారు. వీటిని పరిశీలిస్తున్నామని, కరోనా మహహ్మరి దృష్ట్యా కొత్త నిబంధనలు జారీచేస్తామని స్పష్టం చేశారు.