న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో 2,56,039 శాంపిల్స్ పరీక్షించగా.. వాటిల్లో 40, 421 పాజిటివ్‌గా తేలాయి. వైరస్ బారిన పడి 681 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,18,043కి చేరుకుంది. మృతుల సంఖ్య 27,497కి పెరిగింది. ఇక దేశ వ్యాప్తంగా 1265 ల్యాబ్స్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి ఆరా తీశారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ జగన్ ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడారు. తమ రాష్ట్రంలో కరోనా నియంత్రణలోనే ఉన్నదని.. మరణాల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేసీఆర్ చెప్పారు. తమ రాష్ట్రంలో అధిక టెస్టులు చేస్తున్నామని.. పేదలందరికి ఉచిత వైద్యం అందిస్తున్నామని ఏపీ సీఎం జగన్.. ప్రధానికి వివరించారు.