- ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
- జనవరి 1నుంచే పెంచిన జీతాలు
- రిటైర్డ్మెంట్ఏజ్62 ఏళ్లకు పెంపు
- ఈహెచ్ఎస్ సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ హామీ
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. ఉద్యోగులకు 23 శాతం ఫిట్మెంట్ అందించడంతో పాటు రిటైర్మెంట్ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1, 2022 నుంచి పెంచిన కొత్త జీతాలు చెల్లించనున్నారు. పీఆర్సీ 2018జూలై 1 నుంచి అమలు కానుంది. మానిటరీ బెనిఫిట్ 2020 ఏప్రిల్ 1 నుంచి అమలు కానుంది. సీపీఎస్‌పై జూన్ 30వ తేదీలోగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.10,247 కోట్ల అదనపు భారం పడనుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ జూన్ 30లోగా ప్రొబేషన్, కన్ఫర్మేషన్ పక్రియను పూర్తిచేసి, సవరించిన విధంగా రెగ్యులర్ జీతాలను ఈ ఏడాది జూలై నుంచి జీతం ఇవ్వనున్నారు. సొంతిల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధి చేస్తున్న జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్‌లో ఎంఐజీ లే అవుట్స్‌లోని ప్లాట్లలో 10 శాతం ప్లాట్లను రిజర్వ్ చేయడమే కాకుండా 20శాతం రిబేటును ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు. ‘చీఫ్ సెక్రటరీ కమిటీ ఇచ్చిన నివేదికలో పేర్కొన్న ప్రకారం కంటే 14.29 కంటే ఎంత మాత్రం కూడా ఇచ్చే పరిస్థితిలేదనే విషయాన్ని పదేపదే ఆర్థికశాఖ అధికారులు పలుదఫాలుగా చెప్పారు. మన ఆకాంక్షలు కూడా కాస్త తగ్గాలని కోరానని, అదే సమయంలో ఉద్యోగుల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకోవాలని సీఎస్‌కి, ఆర్థికశాఖ కార్యదర్శికి సుదీర్ఘంగా వివరించి 23 శాతం ఫిట్మెంట్ ప్రకటించామన్నారు. జూన్30 లోగా కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ఈహెచ్ఎస్ ఎంప్లాయిస్ హెల్త్ స్కీంకు సంబంధించిన సమస్యను రెండు వారాల్లో పరిష్కరిస్తామని, ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు, పీఎఫ్, జీఎల్ఐ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ తదితరాలన్నీ ఏప్రిల్ నాటికి పూర్తిగా చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం సంతోషకరమైన నిర్ణయమని ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి అన్నారు. తాము అనుకున్న దానికంటే ఎక్కువే చేసినందున సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.