- ఇంటర్ నేషనల్ విమాన సేవల పునరుద్ధరణ
- కొత్త వేరియంట్ కారణంగా 14 దేశాలకు రద్దు
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి కారణంగా దాదాపు ఏడాదిన్నర క్రితం నిలిచిపోయిన ఇంటర్నేషనల్ విమాన సర్వీసులను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 15 నుంచి విదేశాలకు రెగ్యులర్ సర్వీసులను ప్రారంభించబోతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అయితే 14 దేశాలకు మాత్రం విమానాలను ఇప్పుడే నడపబోవడం లేదని ఏవియేషన్ మంత్రిత్వశాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. కరోనా వైరస్ తీవ్ర ఎక్కువగా ఉన్న, కొత్త వేరియంట్ ప్రభావం ఉన్న దేశాలకు విమానాలను సర్వీసులపై నిషేధం కొనసాగించాలని నిర్ణయించింది. యూకే, ఫ్రాన్స్, జర్మనీ, చైనా, బోట్సావానాతో పాటు 14 దేశాల నుంచి అంతర్జాతీయ విమానాల సర్వీసును ఆపివేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. పలు దేశాల్లో తాజాగా గుర్తించిన కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, ఇప్పుడు ఉన్న వ్యాక్సిన్లకు లొంగే అవకాశం లేకపోవచ్చని సైంటిస్టులు భావిస్తున్న నేపథ్యంలోనే ఆయా దేశాలకు రెగ్యులర్ విమాన సర్వీసులను ప్రారంభించకూడదని నిర్ణయించినట్లు తెలిపింది. అయితే లిస్టులో ఉన్న 14 దేశాల్లో కొన్నింటితో ఎయిర్ బబుల్ అగ్రిమెంట్లు ఉన్నాయని, ఆ దేశాలకు వారానికోసారి ఫ్లైట్ సర్వీసులు ఉండొచ్చని ఏవియేషన్ శాఖ అధికారులు చెప్పారు. కరోనా కారణంగా 2020 మార్చి చివరి వారంలో రెగ్యులర్ ఇంటర్నేషనల్ ఫ్లైట్సర్వీసులను భారత ప్రభుత్వం నిషేధించింది. అయితే విదేశాల్లో చిక్కుకున్న మన వాళ్లను వెనక్కి తీసుకొచ్చేందుకు ‘వందే భారత్’ పేరుతో విమానాలను నడిపింది.