- అన్నీ కోల్పోయిన కృష్ణా, తుంగభద్ర నదీతీర వాసులు
- ఎవరిని పలకరించినా కన్నీళ్లే
- నేటికీ ఇండ్లు కట్టలే.. స్థలాలు ఇవ్వలే
- మద్దూర్ లో నేటికీ అడుగుపెట్టని జిల్లా కలెక్టర్, మంత్రులు
సారథిన్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లా తుంగభద్ర, కృష్ణానది తీర గ్రామాల ప్రజల్లో నాటి వరద భయం ఇంకా వీడడం లేదు. చిన్నపాటి వర్షం వచ్చిన నదులు పొంగుతాయని, వరద వస్తుందేమోననే గుబులు వెంటాడుతోంది. 11 ఏళ్ల క్రితం..2009 అక్టోబర్ 2న సంభవించిన ఆ రెండు నదుల జలప్రళయం అప్పట్లో 43 గ్రామాలను వరదతో ముంచెత్తింది. అపారనష్టం వాటిల్లడంతో పాటు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో రైతులు నష్టపోయారు. కొన్ని గ్రామాలు సర్వం కోల్పోయి నేటికీ దీనస్థితిలోనే కుమిలిపోతున్నారు. వరద విలయానికి ఇళ్లు, పొలాలు, పంటలు కొట్టుకుపోయిన వారికి హామీ హామీగానే మిగిలిపోయింది. అలంపూర్ నియోజకవర్గంలో అలంపూర్, తుమ్మలపల్లి, పడమటి గార్లపాడు, రాజోలి, తూర్పు గార్లపాడు, తుమ్మిళ్ల, ఆర్ గార్లపాడు, మద్దూరు, కూటకనూర్ గ్రామాల్లో తుంగభద్ర ప్రళయానికి చాలా కుటుంబాలు రోడ్డునపడ్డాయి. కొన్ని గ్రామాల్లో పునరావాసం కల్పించారు. మరికొన్ని గ్రామాల్లో కేవలం స్థలసేకరణ చేసి ఇళ్లు కట్టించడంలో కాలయాపన చేస్తున్నారు. మానవపాడు మండలంలోని మద్దూరు గ్రామంలో 2009 అక్టోబర్ 2న వచ్చిన వరదలకు సుమారు 472 ఇళ్లు పూర్తిగా నీటమునిగిపోయాయి.
స్థలసేకరణకే పరిమితం
వరదలు వచ్చి 11 ఏళ్లు పూర్తి కావస్తున్నా మద్దూర్ లో వరద బాధితులకు ఇండ్లు కట్టించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పాలకులైతే కన్నెత్తి కూడా చూడడం లేదు. నాలుగేళ్ల క్రితం స్థలసేకరణ చేశారే తప్ప ప్లాట్లు కేటాయించలేదు. దీంతో చాలామంది వరద బాధితులు శాంతినగర్, కర్నూలు, కలుకుంట్ల, మానవపాడు గ్రామాల్లో బతుకుతున్నారు. మరికొందరు శిథిలమైన ఇళ్లలోనే రేకుల షెడ్ లో వేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు.
చచ్చిపోయి ఉంటే బాగుండేదేమో
అప్పట్లో వచ్చిన వరద ప్రళయం నేటికీ ఇంకా కళ్ల ముందే కనిపిస్తుంది. బిక్కుబిక్కుమంటూ రేకుల షెడ్ లలోనే ఇంకా జీవనం కొనసాగిస్తున్నాం. తల్లి పిల్లలం వేరుపడి బతుకుతున్నాం. అప్పటి వరదల్లోనే చనిపోయి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. దినదినం చచ్చి బతుకుతున్నం.
:: రామేశ్వరమ్మ, మద్దూరు
కలెక్టర్ రాలే.. మంత్రి సూడలే!
వరదలు వచ్చిన ఆ రోజుల్లో ఒక్కనెల రోజులు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు పదే పదే వచ్చి మాకు సహాయం చేశారు. వరదలు వచ్చి 11 ఏళ్లు గడిచినా ఇప్పటికీ నేటికీ గ్రామం వైపునకు జిల్లా కలెక్టర్, మంత్రులు వచ్చిన దాఖలాలు లేవు. మాకు స్థలం చూపిస్తే స్వతహాగా ఇల్లు కట్టుకు మా బాధలు మేం పడతాం.
:: శాలిబీ, మద్దూరు