Breaking News

హరిత తెలంగాణే లక్ష్యం

  • కలప అక్రమ రవాణాను నిరోధించేందుకు ప్రత్యేక విభాగం
  • మొక్కలకు కుటుంబసభ్యుల పేర్లు పెట్టుకోవాలె
  • నర్సాపూర్ లో మొక్కలు నాటిన సీఎం కేసీఆర్​
  • అట్టహాసంగా ఆరో విడత హరితహారం ప్రారంభం

సారథి న్యూస్, మెదక్: తెలంగాణ రాష్ట్రంలో అడవుల పునరుద్ధరణే హరితహారం ముఖ్య ఉద్దేశమని సీఎం కె.చంద్రశేఖర్ రావు అన్నారు. మనం చేతులారా పోగొట్టుకున్న అడవిని తిరిగి మనమే వందశాతం తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్ పార్క్ లో మొక్కలు నాటి ఆరో విడత హరిత హారం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం అర్బన్ పార్కులో నిర్మించిన వాచ్ టవర్ పైకెక్కి నర్సాపూర్ అటవీ ప్రాంతం అందాలను తిలకించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. అక్రమ కలప రవాణాను నిరోధించడానికి ప్రభుత్వం ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తుందన్నారు. తద్వారా అడవుల్లో చీమ చిటుక్కుమన్నా తెలిసిపోతుందన్నారు. అప్పట్లో ఎక్కడ వర్షాలు పడకున్నా ఎక్కువగా అటవీ ప్రాంతం ఉన్న నర్సాపూర్ ఏరియాలో వర్షాలు కురిసేవని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. అడవుల పునరుద్ధరణకు ఎంత డబ్బులైనా ఖర్చుచేస్తామన్నారు. ఇప్పటికే అటవీ శాఖలో రెండువేల ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు. 2,200 వాహనాలు ఇచ్చామన్నారు.


డబ్బులకు ఇబ్బంది లేదు
రాష్ట్రంలో డబ్బులకు ఎలాంటి ఇబ్బంది లేదు.. కరోనా లాక్​డౌన్ కారణంగా మూడు నెలలు ఉద్యోగులకు సగం జీతాలు ఇచ్చామని, ప్రస్తుతం మొత్తం జీతాలు ఇస్తామన్నారు. అందరికి సంబంధించిన వేతనాలు ఆపినప్పటికీ రైతులకు సంబంధించిన రైతుబంధు, గ్రామాలు, మున్సిపాలిటీలకు నిధులను ఆపడంలేదని వివరించారు. వచ్చే ఏడాదిలోగా కాళేశ్వరం నుంచి సంగారెడ్డికి నీళ్లు వస్తాయని, ఇప్పటికే నర్సాపూర్ దాటి పాములపర్తి వరకు వచ్చాయన్నారు. తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో హరితహారం కార్యక్రమం కింద పదివేల మొక్కలు నాటేందుకు నానా ఇబ్బందులు పడ్డానని, అదే అనుభవంతో రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేసినట్లు సీఎం కేసీఆర్ వివరించారు.
మొక్కలకు పేర్లు పెట్టాలె
‘92వేల ఎకరాల అడవిని పోగొట్టుకున్నాం. సినిమా షూటింగుల కోసం నర్సాపూర్‌ అటవీ ప్రాంతాన్నే ఎంచుకునేవాళ్లు. గతంలో ఇక్కడ చాలా షూటింగులు జరిగాయి. సమష్టి కృషితోనే ఈ అటవీ ప్రాంతానికి పునరుజ్జీవం కలుగుతుంది. సర్పంచ్​లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కథానాయకులు కావాలి. ఇందులో ప్రజల సహకారం కూడా కావాలి. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు నాటాలి. నాటిన మొక్కలకు కుటుంబసభ్యుల పేర్లు పెట్టాలి. మొక్క ఎండిపోతే బిడ్డ ఎండిపోయినట్లు’ అని సెంటిమెంట్‌ క్రియేట్‌ చేయాలి’అని సీఎం చెప్పారు.
రైతులు బాగుపడాలి
రాష్ట్రంలో రైతులు బాగుపడాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, రైతుల అప్పలు తీరిపోవడంతో పాటు వారి బ్యాంకు ఖాతాల్లో ఎప్పటికీ కనీసం రూ.లక్ష ఉండాలని, ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. నియంత్రిత సాగు విధానం ద్వారా డిమాండ్​ ఉన్న పంటలనే వేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,601 క్లస్టర్ కేంద్రాల్లో రైతు వేదికలను వచ్చే ఏడాది యాసంగి సీజన్​ వరకు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించామని సీఎం కేసీఆర్​ వెల్లడించారు. దీనికి సంబంధించిన పనులను తానే స్వయంగా హైదరాబాద్ నుంచి పర్యవేక్షిస్తానని చెప్పారు. మంత్రులు హరీశ్​రావు, ఇంద్రకరణ్​ రెడ్డి, కలెక్టర్​ ఎం.ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.