Breaking News

స్వామి అగ్నివేశ్​ ఇకలేరు

స్వామి అగ్నివేశ్​ఇక లేరు

న్యూఢిల్లీ: ఆర్యసమాజ్‌ నేత, ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌ (80) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించడంతో మృత్యువాతపడ్డారు. 1939 సెప్టెంబర్‌ 21న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో స్వామి అగ్నివేశ్‌ జన్మించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో తాతగారి స్వగ్రామం చత్తీస్ ఘడ్ కు వెళ్లిపోయారు. అనంతరం కలకత్తాలోని సెయింట్‌ జేవియర్‌ కాలేజ్‌ నుంచి లా, కామర్స్‌ డిగ్రీ చదివారు. ఆర్యసభ పేర రాజకీయ పార్టీని స్థాపించి హర్యానా నుంచి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. విద్యాశాఖ మంత్రిగా విద్యారంగంలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.

సామాజిక సమస్యలపైనే చివరిదాకా పనిచేశారు. పర్యావరణ పరిరక్షణ, బాలల వెట్టిచాకిరీపై పోరాటం, ప్రాంతీయ ఉద్యమాలపై ఆయన తనదైన శైలిలో ఉద్యమిస్తూ ప్రజలను చైతన్యవంతులు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మొదటి నుంచీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మతం కంటే ఎక్కువగా మానవత్వాన్ని ప్రేమించారు. ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్​ మరణం పట్ల సీఎం కె.చంద్రశేఖర్​రావు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. ‘కాషాయం కట్టిన వాళ్లందరూ గొప్పవాళ్లు కారు. కానీ స్వామి అగ్నివేశ్​మాత్రం నిస్సందేహంగా గొప్పవారే. పీడితులకు బాసటగా చివరిదాకా నిలబడిన మన కాలపు మహామనిషికి జోహార్’ అంటూ సోషల్ ​మీడియా వేదికగా పలువురు సంతాపం తెలుపుతున్నారు.