సౌత్ జానర్లో ప్రత్యేకించి పరిచయం అవసరం లేని సీనియర్ హీరోయిన్ త్రిష. టాలీవుడ్లో కంటే కోలీవుడ్‌లోనే త్రిష హవా ఎక్కువగా ఉంది. తెలుగులో సీనియర్ హీరోల దగ్గరినుంచి ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న హీరోలు అందరితోనూ నటించేసింది. అయితే కొద్దికాలంగా తెలుగు చిత్రాల్లో నటించడం తగ్గించిందనే చెప్పొచ్చు. 37 ఏళ్లు దాటుతున్నా త్రిష తన సెకెండ్ ఇన్నింగ్స్‌లో కూడా తమిళంలో మాత్రం జెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’ సినిమాలో చాన్స్ వచ్చినా డేట్స్ కుదరక ఆ ఆఫర్ వదులుకునేంత బిజీ షెడ్యూల్స్‌లో త్రిష ఉందంటే ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం త్రిష నటించిన ‘పరపదమ్ విలయాట్టు’, ‘గర్జనాని’ రెండు సినిమాలూ విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఆమె చేతిలో మరో నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంలోనూ నటిస్తోంది ఈ బ్యూటీ. అలాగే రాంగీ, షుగర్ అనే సినిమాలు కూడా చిత్రీకరణ దశలో ఉన్నాయి.
వీటితో పాటు మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ అప్ కమింగ్ మూవీ ‘రామ్’లో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా నేపథ్యంలో ఆగిన ‘రామ్’ షూటింగ్ ఇప్పుడు మళ్లీ స్టార్ట్ అయింది. త్రిష కూడా ఈ చిత్రీకరణలో పాల్గొంటోంది. స్టార్ హీరోయిన్లు అంతా కరోనా నేపథ్యంలో బయటకు రాకుండా బయపడుతుంటే.. త్రిష మాత్రం ధైర్యంగా షూటింగ్ కు హాజరవుతుండడం ఇప్పుడు తమిళ సినీవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొత్తం మీద త్రిష 37 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోయిన్స్ కు పోటీఇస్తూ వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ తన హవా చూపిస్తోందన్నమాట.