రీల్ లైఫ్‌లో విలన్ గా అనేక సినిమాల్లో నటించి మెప్పించిన సోనూసూద్ లాక్ డౌన్ సమయంలో మాత్రం ఎవరు ఎక్కడ ఇబ్బందిపడినా నేనున్నానని ఆదుకుని రియల్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం నాలుగైదు సినిమాల్లో నటిస్తున్న సోనూ షూటింగులు మొదలవగానే సెట్స్ కు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న ‘అల్లుడు అదుర్స్’ షూటింగ్ లో వచ్చే సోమవారం పాల్గొనబోతున్నాడని మూవీ టీమ్ తెలియజేసింది. సాయి శ్రీనివాస్, సోనూసూద్ కాంబోలో గతంలో వచ్చిన ‘సీత’ మూవీకి మంచి టాక్ వచ్చింది. మరోసారి రిపీట్ కానున్న వీరి కాంబినేషన్ సక్సెస్ అయిందని భావిస్తున్నారు.
వచ్చే వారం నుంచి షూటింగ్ లో జాయిన్ కానున్న సోనూతో సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేయాలని దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ భావిస్తున్నాడట. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మిస్తున్న మూవీలో శ్రీనివాస్ సరసన నభా నటేష్, అను ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, సోనూసూద్, వెన్నెల కిశోర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘అల్లుడు అదుర్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే టీజర్‌ను విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది.