హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా రూపొందుతున్న చిత్రం ‘సెహరి’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు నందమూరి బాలకృష్ణ. అప్పుడు సినిమా విశేషాలతో పాటు చాలా విషయాలు మాట్లాడారు. ‘కరోనా అనేది న్యూమోనియాకి సంబంధించింది. దీనికి ఇంతవరకు వ్యాక్సిన్ రాలేదు. ఆరోగ్య భద్రతలు పాటిస్తూ జాగ్రత్తగా ఉంటే మంచిది. అందరూ ఆరోగ్యంగా ఉండండి..’ అని చెప్పారు. కోటి కీలకపాత్రలో నటిస్తున్న ‘సెహరి’ చిత్రానికి జ్ఞానసాగర్ దర్శకుడు. అద్వయ జిష్ణురెడ్డి, శిల్పాచౌదరి నిర్మిస్తున్నారు. ఇటీవలే మూవీ పనులు స్టార్ట్ చేశారు. బాలయ్య బాబు చేతులమీదుగా ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేయించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ‘కార్తీకమాసం మొదటి సోమవారం ‘సెహరి’ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం శుభసూచికం. ఈ సినిమా స్టోరీ విన్నప్పుడు ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. నాకు తోచిన సలహాలు, సూచనలు చెప్పాను. నిడివి రెండు గంటల లోపు ఉండేలా చూసుకోమని కూడా చెప్పాను. కరోనా టైమ్ లోనూ షూటింగ్ జరపడం అభినందించదగ్గ విషయం. ఈ సినిమా విడుదలై టీమ్ మొత్తానికి మంచి పేరు రావాలని, మరిన్ని సినిమాలు చేయాలని దీవిస్తున్నాను’ అన్నారు. ‘నా పుట్టిన రోజున ఫస్ట్ లుక్ లాంచ్ చేయడానికి బాలకృష్ణ రావడం అతిపెద్ద బర్త్ డే గిఫ్ట్. ఇదో న్యూ ఏజ్ లవ్‌స్టోరీ. నేనే కథ రాశాను. నా పర్సనల్ లైఫ్‌తో పాటు ఫ్రెండ్స్ జీవితాల్లో జరిగిన ఇన్సిడెంట్స్‌ను స్టోరీగా తీసుకున్నాను. ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్స్ కూడా ఆకట్టుకుంటాయి’ అన్నాడు హీరో. ‘సినిమా మొదలుపెట్టినప్పటి నుంచీ అన్నీ పాజిటివ్‌గానే జరుగుతున్నాయి. ఫస్ట్ షెడ్యూల్ చాలా బాగా వచ్చింది. బాలకృష్ణ వచ్చి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం ఇంకా హ్యాపీగా ఉంది’ అన్నాడు దర్శకుడు. నిర్మాతలతో పాటు సిమ్రాన్ చౌదరి, నటులు అభినవ్, ప్రణీత్ పాల్గొన్నారు.