సారథి న్యూస్, హైదరాబాద్: కరోనాను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం క్షేత్రస్థాయి చర్యలకు ఉపక్రమించింది. ప్రజలను అవగాహన కల్పించి మహమ్మారికి అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే జలశక్తి శాఖ అదనపు కార్యదర్శి అరుణ్ భరోక నేతృత్వంలో కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖల అధికారుల బృందం ఆదివారం హైదరాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటించింది. మొదట మెహిదీపట్నం రైతు బజార్‌ను సందర్శించింది. రైతు బజార్‌లో నిత్యావసర వస్తువులను విక్రయిస్తున్న కిరాణ షాపును పరిశీలించి అమ్మకాల గురించి షాపు యజమానితో మాట్లాడారు.
సామాజిక దూరాన్ని అమలు చేసేందుకు కూరగాయల షాపుల ముందు ఏర్పాటుచేసిన బాక్స్ లను పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మక్తాగూడ గ్రామానికి చెందిన రైతు చెనువల్లి శేఖర్ తో మాట్లాడారు. వంకాయలు, ఇతర కూరగాయలను ప్రైవేట్ వాహనంలో తెచ్చి విక్రయించి వెళ్తున్నట్లు ఆయన వారికి చెప్పాడు. మొయినాబాద్ మండలం హజీజ్‌నగర్‌కు చెందిన మంచె యాదయ్య యాదవ్ తో మాట్లాడారు. తన పొలంలో పండించిన పాలకూరను ద్విచక్రవాహనంపై తీసుకొచ్చి విక్రయించుకుని వెళ్తున్నట్లు వివరించారు. రైతు బజార్ లోని అన్ని దుకాణాలను కేంద్ర బృందం పరిశీలించింది. అన్ని రకాల కూరగాయలు, ఆకు కూరలు, పండ్లను అన్ని ప్రాంతాల వారికి అందుబాటులో ఉంచేందుకు 120 మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేసినట్లు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రావీణ్య వివరించారు.
నేచర్ క్యూర్ హాస్పిటల్‌లో పరిశీలన..
అనంతరం నేచర్ క్యూర్ హాస్పిటల్‌లో ఏర్పాటుచేసిన ప్రభుత్వ క్వారంటైన్ ను కేంద్ర బృందం తనిఖీ చేసింది. వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో కేంద్ర బృందం మాట్లాడింది. క్వారంటైన్ లో ఉంచిన వ్యక్తులకు వైద్య ప్రమాణాల ప్రకారం పోషకాహారాన్ని అందించినట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతమహంతి వివరించారు. ప్రస్తుతం నేచర్ క్యూర్ హాస్పిటల్‌లో క్వారంటైన్‌లో ఎవరూ లేరని తెలిపారు. శాంపుల్ టెస్టింగ్ ల్యాబ్‌ను కేంద్ర బృందం తనిఖీ చేసింది. అనంతరం మలక్‌పేట్ కంటైన్ మెంట్ జోన్‌ను కేంద్ర బృందం తనిఖీచేసింది. బారికేడింగ్‌ను పరిశీలించారు. బృందంలో కేంద్ర ప్రజారోగ్యశాఖ సీనియర్ వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్ గెడం, జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్ డాక్టర్ హేమలత, వినియోగదారుల వ్యవహారాల శాఖ డైరెక్టర్ ఎస్‌ఎస్.ఠాకూర్, జాతీయ విపత్తు నివారణ సంస్థ అసోసియేట్ ప్రొఫెసర్ శేఖర్ చతుర్వేది, జీహెచ్‌ఎంసీ కమిషనర్ డీఎస్.లోకేష్ కుమార్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి, జోనల్ కమిషనర్లు ఎన్.రవికిరణ్, ప్రావీణ్య, సామ్రాట్ అశోక్ ఉన్నారు.