Breaking News

‘సుక్క’ చిన్నబోయింది.. ఆకలికి చిక్కి పోయింది

‘సుక్క’ చిన్నబోయింది. ఆకలికి చిక్కి పోయింది

సారథి న్యూస్, శ్రీకాకుళం: ఆమె..ఒకప్పుడు ఎమ్మెల్యే. ప్రజలకు దీనబంధు. కష్ట జీవుల కళ్లల్లో చిరుదీపం. కారు లేదు. జేజేలు కొట్టే కార్యకర్తలు లేరు. వెన్నంటే తిరిగే పోలీసులు లేరు. కేవలం కూలి పనికి వెళ్లడానికి కాలినడకే దిక్కు. ఆమె ఎవరో కాదు ఏపీలోని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే సుక్క పగడాలమ్మ. ప్రస్తుతం ఈ సుక్క చిన్నబోయింది. ఆకలికి చిక్కిపోయింది. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం ముక్తాపురం గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సుక్క పగడాలమ్మ ప్రస్తుతం నిరాడంబర జీవితానికి చిరునామాగా మారిపోయారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో ఓసారి ప్రజాప్రతినిధి అయితే చాలు తరతరాలకు సరిపడా సంపదను కూడబెట్టుకొనే రోజులివి. ఇలాంటి పరిస్థితుల్లో 1972–78 మధ్య కాలంలో పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసిన సుక్కా పగడాలమ్మ నేడు ప్రభుత్వ పింఛన్​పైనే ఆధారపడుతూ ఇప్పటికీ సాధారణ జీవితం గడుపుతున్నారు.
అభివృద్ధి పనులకు చిరునామా
1972లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాతపట్నం నియోజకవర్గం ఎస్సీ మహిళకు కేటాయించడంతో ముక్తాపురానికి చెందిన పగడాలమ్మ కాంగ్రెస్‌(ఐ) పార్టీ తరఫున పోటీచేసి 7,560 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.  పి.వి.నరసింహారావు, జలగం వెంగళరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పగడాలమ్మ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎనలేని కృషిచేశారు. విద్య, వైద్య, రోడ్లు గిరిజన హాస్టళ్ల అభివృద్ధికి పాటుపడ్డారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బస్సుల్లోనే ప్రయాణిస్తూ గ్రామాలు తిరుగేవారు. ఏ గ్రామానికి వెళ్లినా దాహం వేస్తే మంచినీటి బావిలో నీళ్లు, చెరువు నీళ్లుతాగేవారు. ఆమెకు ప్రస్తుతం సెంటు భూమి కూడా లేదు. ప్రభుత్వం ఇచ్చే పింఛన్​డబ్బులతో జీవనం సాగిస్తున్నారు.
పూరి గుడిసెలోనే నివాసం
ప్రస్తుతం ఆమెకు పింఛన్​డబ్బులు చాలకపోవడంతో గ్రామంలో కూలీ పనులు చేస్తున్నారు. శిథిలావస్థకు చేరుకున్న పూరి గుడిసెలో నివసిస్తున్నారు. ఇళ్లు మరమ్మతులు చేసుకోవడానికి ఆర్థిక స్థోమత లేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తనను ఆదుకోవాలని ఆమె వేడుకుంటుంది. ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో నీతినిజాయితీగా ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం పనిచేసిన ఈమె ఉపాధి హామీ పనులు చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు. 1972లో పాతపట్నం నియోజక వర్గం ఎమ్మెల్యేగా గెలిచిన సుక్కా పగడాలమ్మ నియోజక వర్గం అభివృద్ధికి చేస్తున్న కృషి ప్రజా సమస్యలపై ఆహర్నిశలు శ్రమిస్తున్న విషయాన్ని గ్రహించిన అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధి ఆమెను అభినందించి ప్రశంసించారు. అలాంటి నాయకురాలు ఇప్పుడు తిండికోసం నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.