Breaking News

సిమెంట్​ రేటు తగ్గించండి

సారథి న్యూస్​, హైదరాబాద్​: లాక్ డౌన్ అనంతర పరిస్థితుల నేపథ్యంలో సిమెంట్ ధర తగ్గించాలని మున్సిపల్ ​శాఖ మంత్రి కేటీఆర్​, హౌసింగ్​శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. గురువారం సిమెంట్​ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రియల్ ఎస్టేట్ రంగానికి చేయూత ఇచ్చేందుకు ధర తగ్గించాల్సిన అవసరం ఉందని సిమెంట్ కంపెనీ ప్రజాప్రతినిధులు తేల్చిచెప్పారు.

2016లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి రూ.230 బస్తా ఇచ్చేందుకు అంగీకరించిన కంపెనీలు మరో మూడేళ్ల పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లతో పాటు ప్రభుత్వ పథకాలకు ఇదే రేటుపై ఇచ్చేందుకు అంగీకరించాయి. హుజూర్​ నగర్ పరిసర ప్రాంతాల్లో స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్​స్ట్రక్షన్స్​ ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ కుమార్, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు.