సారథి న్యూస్, హైదరాబాద్: ఈ ఏడాది డిసెంబర్ నాటికి హైదరాబాద్ మహానగరంలో సుమారు 85వేలకు పైగా డబుల్ బెడ్రూమ్ఇండ్లను పేదలకు అందించనున్నట్లు మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారకరామారావు వివరించారు. సుమారు రూ.9,700 కోట్ల వ్యయంతో దేశంలో ఏ మెట్రో నగరంలో లేనంత పెద్దఎత్తున జీహెచ్ఎంసీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని చేపడుతుందన్నారు. సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లతో పాటు జీహెచ్ఎంసి హౌసింగ్ విభాగం అధికారులు, మున్సిపల్‌శాఖ ఉన్నతాధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. చాలాచోట్ల పనులు తుదిదశకు చేరుకున్న నేపథ్యంలో తాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల కల్పన తదితర పనులు వేగవంతం చేయాలన్నారు. సుమారు 75వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు మరో 10వేల జేఎన్ఎన్ యూఆర్ఎం, వాంబే ఇళ్లు ఉన్నాయని అధికారులకు మంత్రి తెలిపారు. నియోజకవర్గానికి నాలుగువేల చొప్పున 24 నియోజకవర్గాలకు లక్ష ఇళ్లు అందించే కార్యక్రమం ఉండబోతుందన్నారు. ముందుగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం స్థలాల ఇచ్చిన మురికివాడల్లోని లబ్ధిదారుల జాబితాను వెంటనే అప్లోడ్ చేయాలని ఆదేశాలు జారీచేశారు. సమావేశంలో నగర మేయర్ బొంతు రామ్మెహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, మున్సిపల్ముఖ్యకార్యదర్శి అరవింద్ కూమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.