సారథి న్యూస్, రామాయంపేట: ఏరువాక పౌర్ణమి.. రైతులు పవిత్రంగా జరుపుకునే పర్వదినం. తెలంగాణలో ఎరొక్క పున్నమి అని పిలుస్తారు. ప్రకృతిని దైవంగా ఆరాధించడం భారతీయుల సంప్రదాయం. వ్యవసాయం మానవ మనుగడకు జీవనాధారం. వ్యవసాయ పనులను ప్రారంభించే ముందు భూమికి పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. జేష్ఠ్య శుద్ధ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని పిలుస్తుంటారు. అందులో భాగంగానే ఏటా జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ రోజున ఈ పండుగను రైతన్నలు ఘనంగా జరుపుకుంటారు. వ్యవసాయానికి ఎద్దులే ప్రధాన ఆధారం. అవి లేకుండా రైతులు ఏ పనీ చేయలేరు. అందుకే వాటిని దైవంగా భావించి పూజిస్తారు.
పండుగ రోజున ఎద్దులను కడిగి కొమ్ములకు అందమైన రంగులు పూసి, మెడలో జేగంటలు, రంగురంగుల పూసలు, పూలతో నిండిన దిష్టితాళ్లను కట్టి అలంకరిస్తారు. కాళ్లకు ఘల్లు ఘల్లు సప్పుడే వచ్చే గజ్జెలు కట్టి.. నాగలిని కాడికి కూడా రంగులు పూస్తారు. ఎద్దులను కట్టేసే పశువుల పాకను పసుపు, కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. పరమాన్నం వండి ఎద్దులకు తినిపిస్తారు. ఈ శుభదినాన ఏరువాక ప్రారంభించే అన్నదాతలకు సిరుల పంట పండుతుందని విశ్వాసం.
సారథి న్యూస్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో శుక్రవారం రైతులు నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో మంత్రి జి.జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు.
రైతులతో కలిసి కాడికి పూజలు చేసి ఏరువాకను ప్రారంభించారు. ఆయన వెంట ఎంపీ లింగయ్య యాదవ్, జడ్పీ చైర్ పర్సన్ దీపిక, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్, ఎంపీపీలు, జడ్పీటీసీలు ఉన్నారు.