Breaking News

సాగర్​కు జలకళ

సాగర్​కు జలకళ

సారథి న్యూస్​, నాగార్జునసాగర్‌ : నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం గురువారం సాయంత్రం క్రస్ట్‌గేట్లను తాకింది. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు వద్ద విద్యుదుత్పత్తి చేస్తూ సాగర్‌కు 40,259 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో గురువారానికి క్రస్ట్​గేట్ల లెవల్‌ (546 అడుగుల)కు నీటిమట్టం చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 13 రోజులుగా వరద వస్తుండగా, సాగర్‌ నీటిమట్టం రోజుకు ఒక అడుగు చొప్పున 13 అడుగులు పెరిగింది. సాగర్‌ నుంచి కుడి, ఎడమ కాల్వలకు, ప్రధాన జలవిద్యుత్​ కేంద్రానికి నీటిని విడుదల చేయడం లేదు. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,650 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ ప్రాజెక్టు సామర్థ్యం 312.0405 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 201.4858 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గతేడాది ఇదే రోజున సాగర్‌లో 126.4097టీఎంసీల నిల్వ ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు.

నాగార్జున సాగర్​(ఫైల్ ఫొటో​)