విలక్షణమైన నటన, వస్త్రధారణతో.. తెలంగాణ గ్రామీణ యాసకు తనదైన మార్కుని జోడించిన బిత్తిరి సత్తి తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. మొదట వీ 6 ఛానెల్ లో తీన్మార్ ప్రోగ్రాంతో సావిత్రి అలియాస్ జ్యోతితో చేవెళ్ల రవి అలియాస్ బిత్తిరి సత్తి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తాను పనిచేసిన ఛానల్ లో అభిప్రాయ భేదాలు రావడం, సావిత్రి బిగ్ బాస్ షోకు వెళ్లడంతో బిత్తిరి సత్తి అక్కడ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత అంతకు మించిన సాలరీతో టీవీ9లోకి అడుగు పెట్టాడు. ఈ ఛానెల్లో ఇస్మార్ట్ న్యూస్ పేరుతో ప్రోగ్రామ్ మొదలైంది. అంతా సాఫీగానే సాగుతున్న సమయంలో సత్తి మళ్లీ ఈ ఛానల్‌కు రాజీనామా చేశాడన్న న్యూస్ వైరల్ అయింది.
అయితే బిగ్‌బాస్ కోసమే రాజీనామా చేశాడని కొంత మంది.. లేదు సాలరీ పెంచాలంటూ డిమాండ్ చేయడంతో ఛానల్ నుంచి తప్పించారని కొంత మంది చెప్పుకొచ్చారు. ఇదిలా వుంటే తాజా సమాచారం మాత్రం ఇందుకు భిన్నంగా వినిపిస్తోంది. టీవీ9 ఛానల్‌ని వదిలిన బిత్తిరి సత్తి సాక్షి ఛానల్‌లో ప్రత్యక్షం కాబోతున్నాడని.. ఈ ఛానెల్ టీవీ 9 అందించిన సాలరీతో పాటు కొంత ఫ్రీడమ్‌ను అందిస్తుండడంతో బిత్తిరి సత్తి వెంటనే సాక్షి ఛానల్ వారి ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని, త్వరలో బిత్తిరి సత్తి సరికొత్త అవతారంతో సాక్షి ఛానెల్లో ఓ కార్యక్రమం ప్రారంభం కానుందన్న వార్త వైరల్ అవుతోంది.