సారథి న్యూస్, విజయనగరం: కరోనా వైరస్ కట్టడికి ప్రజలు, అధికారులు, పాలకుల సంయుక్త పోరాటంతో జిల్లా గ్రీన్ జోన్‌లో ఉందని ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం విజయనగరం కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
కరోనా రాకుండా ఇప్పటివరకు సురక్షితంగా ఉన్నామని, భవిష్యత్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగేలా చూడాలని అధికారులను కోరారు. జూలై 8న పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని, వెల్ నెస్ సెంటర్లు, గ్రామ సచివాలయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరారు. కలెక్టర్ హరిజవహర్‌లాల్ మాట్లాడుతూ కరోనా నియంత్రణకు ఏడు అంచెల వ్యూహంతో ముందుకు వెళ్తున్నామన్నారు. 55 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి రాకపోకలు నియంత్రిస్తున్నామని, జిల్లా సరిహద్దులను మూసి వేశామని ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు.
జిల్లాలో నిత్యావసర సరుకులకు, కూరగాయలకు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకున్నట్టు జేసీ డాక్టర్ జీసీ కిశోర్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ.. జిల్లా ఆస్పత్రిని కరోనా హాస్పిటల్గా మార్పు చేశామన్నారు. ఎస్ కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కొత్తవలస తదితర ప్రాంతాలనుంచి రైతులు కూరగాయల విక్రయానికి విశాఖపట్నం వెళ్లడానికి అనుమతించాలని కోరారు. పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలులో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు.
బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలవల్ల తమ నియోజకవర్గంలో పలు పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర మాట్లాడుతూ ధాన్యం దిగుబడి విషయంలో వ్యవసాయాధాకారులు వేస్తున్న అంచనాలు సరికాదని, తన నియోజకవర్గంలోనే నీటి వనరుల లభ్యత కారణంగా అధిక దిగుబడి వస్తోందన్నారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఉద్యాన పంటల సేకరణకు సంబంధించి జిల్లా సరిహద్దు గ్రామాల్లోని రైతులు పక్కజిల్లాకు చెందిన సమీప గ్రామంలోకి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారని, సమస్యను పరిష్కరించాలని కోరారు.