సుశాంత్ రాజ్ పుత్ సింగ్ ఆత్మహత్య గురించి ఎంక్వయిరీ చేస్తుంటే రోజుకో కొత్త న్యూస్ బయటపడుతోంది. అటు ఇటు తిరిగి అది డ్రగ్స్‌తో ముడిపడింది. అతనికి డ్రగ్స్ ఇచ్చిందన్న విషయం తెలిసి సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రిచా చక్రవర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే రిచా నోరు విప్పడంతో సెలబ్రిటీల మెడలకు ఉచ్చు బిగుసుకుంటోంది. బాలీవుడ్ లో మొదలైన డ్రగ్స్ ప్రకంపనలు శాండిల్ వుడ్ మీదుగా ఇప్పుడు టాలీవుడ్ కు పాకాయి. డ్రగ్స్ కేసులో ఇప్పటికే హీరోయిన్ రియా చక్రవర్తితో పాటు పలువురు డ్రగ్ డీలర్లను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు శాండిల్ వుడ్ లో నటీమణులు రాగిణి ద్వివేది, సంజన గల్రాని అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలో రియా చక్రవర్తి సుమారు 25 మంది సినీ ప్రముఖుల పేర్లు వెల్లడించింది అంటున్నాయి పోలీసు వర్గాలు. అయితే రియా బయటపెట్టిన జాబితాలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కుడా బయటకు వచ్చింది. దీనిపై నేషనల్ మీడియాలో వస్తున్న వార్తలు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి.
ఇదిలాఉండగా.. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం క్రిష్, పంజా వైష్ణవ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. మూడు రోజులుగా తెలంగాణలోని వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాలో రకుల్ పై సన్నివేశాలు షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఈరోజు కూడా షూటింగ్ కు వెళ్లిన రకుల్.. డ్రగ్స్ కేసులో తన పేరు బయటకు రావడంతో అక్కడినుంచి హుటాహుటిన జూబ్లీహిల్స్ లోని నివాసానికి వెళ్లిపోయింది. అయితే రకుల్ పై వస్తున్న ఈ ఆరోపణలను ఆమె మేనేజర్ ఖండిస్తున్నారని, ఆమెపై కుట్రతో ఇదంతా చేస్తున్నారని వాదిస్తున్నారంటున్నారు. మరోవైపు నార్కోటెక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఈ రోజు సాయంత్రం అత్యవసరంగా సమావేశం కానుందని సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే రియా వెల్లడించిన 25 మంది సినీప్రముఖులకు నోటీసులు జారీచేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.