Breaking News

శ్రీశైలం.. పవర్​హౌస్​లో అగ్నిప్రమాదం

శ్రీశైలం.. జెన్​కో పవర్​హౌస్​లో అగ్నిప్రమాదం

సారథి న్యూస్, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం పాతాళగంగ వద్ద శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ టీఎస్ జెన్ కో విద్యుత్ కేంద్రం మొదటి యూనిట్​లోని ఓ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా గురువారం అర్ధరాత్రి సమయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా పెద్ద పేలుడు శబ్దం సంభవించి మంటలు ఎగిసిపడడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. జీరో లెవెల్ నుంచి సర్వీస్ బే వరకు మంటలు వ్యాపించాయి. ఉద్యోగులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అయితే కొంతమంది ఉద్యోగులు సొరంగ మార్గంలోనే చిక్కుకున్నారు. అగ్నిమాపక దళం సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసేందుకు తీవ్రంగా శ్రమించింది. ప్రమాదం జరిగినప్పుడు దాదాపు 19 మంది సిబ్బంది విధుల్లో ఉన్నట్లు తెలిసింది. వారిలో 10 మందిని రెస్క్యూ టీం కాపాడింది. విషయం తెలుసుకున్న విద్యుత్​శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి, ప్రభుత్వ విప్​, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్,జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు, కలెక్టర్ శర్మన్, ఎస్పీ సాయిశేఖర్ హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలను దగ్గరుండి పరిశీలించారు.లోపల చిక్కుకున్నవారిని డీఈలు శ్రీనివాస్, వెంకట్రావు, ఏఈలు ఫాతిమా, మోహన్, సుందర్, కిరణ్, రాంబాబు, మరో ఇద్దరు హైదరాబాద్ కు చెందిన ప్రవేట్ ఎలక్ట్రిషన్ ఉద్యోగులుగా అధికారులు గుర్తించారు.

పవర్​ హౌస్​ ను పరిశీలిస్తున్న మంత్రి జగదీశ్​రెడ్డి, ప్రభుత్వ విప్​ గువ్వల బాలరాజు
ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న వారిని పరామర్శిస్తున్న మంత్రి జగదీశ్​రెడ్డి, ప్రభుత్వ విప్​ గువ్వల బాలరాజు

ప్రమాదం దురదృష్టకరం: మంత్రి జగదీశ్​రెడ్డి
‘శ్రీశైలం ప్రాజెక్టు లెఫ్ట్ పవర్ హౌస్ లో ప్రమాదం దురదృష్టకరం. మొదటి యూనిట్​ ఫైర్ జరిగింది. నాలుగు ప్యానెల్స్ దెబ్బతిన్నాయి. పదిమంది బయటకు వచ్చారు. లోపల 9మంది చిక్కుకున్నారు. లోపల దట్టమైన పొగ ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఫైర్, పోలీస్ సిబ్బంది లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు వెళ్లారు. పొగతో మూడుసార్లు లోపలికి వెళ్లి వెనక్కివచ్చారు. ఆక్సిజన్ పెట్టుకుని వెళ్లినా సంఘటన స్థలానికి వెళ్లలేకపోతున్నారు. ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది లోపలకు వెళ్లే ప్రయత్నిస్తోంది. సింగరేణి సిబ్బంది సహాయం కోరాం. లోపల ఉన్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం. జెన్ కో ఆస్పత్రిలో ఆరుగురు చికిత్స పొందుతున్నారు’ అని విద్యుత్​శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి వివరించారు.