Breaking News

శివాలయాల్లో ప్రదక్షిణలు అలా చేయొద్దు

సాధారణంగా మనం ఏ ఆలయానికి వెళ్లిన ఆలయం చుట్టూ పూర్తిగా సవ్యమార్గంలో ప్రదక్షిణలు చేస్తాం. కానీ శివాలయాల్లో మాత్రం ప్రదర్శన క్రమం అలా చేయొద్దని శైవ ఆగమం చెబుతోంది. దీన్నే చండీశ్వర ప్రదక్షిణలు అని పిలుస్తారు. ఆల‌యానికి వెళ్తే మ‌న‌స్సుకు ప్రశాంతత క‌ల‌గ‌డ‌మే కాకుండా, ఆ ప‌రిస‌రాల్లో ఉండే పాజిటివ్ శ‌క్తి మ‌న‌లోకి ప్రవేశిస్తుంది. దీంతో కొత్త ఉత్సాహం వ‌స్తుంది. ఏ దేవాలయానికి వెళ్లినా దైవాన్ని ద‌ర్శించుకునే ముందు గుడి చుట్టూ ప్రదక్షిణ‌లు చేస్తారు. కొంద‌రు త‌మ వీలును బ‌ట్టి ఎక్కువ ప్రదక్షిణలు చేస్తే మరికొంద‌రు మనసా, వాచ, కర్మన అని త్రికరణ శుద్ధికి ప్రతీకగా మూడు ప్రదక్షిణలే చాలని చెప్పి అనంత‌రం దైవదర్శనం కోసం వెళ్తారు. నిజానికి ఈ ఆలయంలో ఎన్ని మాత్రమే ప్రదక్షిణలు చేయాలని ఏ ప్రామాణికం లేదు. ఇవన్నీ కూడా వారి వారి మనసును వారి సంకల్పాన్ని బట్టి నిర్ణయించుకున్నది మాత్రమే. దేవుడి గుడికి వెళ్లిన‌ప్పుడు భ‌క్తులు అలా త‌మ వీలును బ‌ట్టి ప్రదక్షిణలు చేయొచ్చు కానీ శివుడి గుడికి వెళ్లిన‌ప్పుడు మాత్రం ఆన్ని గుళ్లలో చేసినట్టు కాకుండా ఒక క్రమ పద్ధతిలోనే ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది.


అదేమిటో తెలుసుకుందాం..
‘‘వృషం చండం వృషం చేయివా సోమసూత్రంచ పునఃవృషం చండంచ సోమ సూత్రంచ పుణఃశ్చండం పునఃవృషం’’
అంటే..
శివాలయంలోని గ‌ర్భగుడిలో ఉన్న శివుడికి ఎదురుగా నంది ఉంటుంది. పక్కనే లింగాన్ని అభిషేకించిన జ‌లం వెళ్తూ ఉంటుంది. ఇలా ఉత్తరభాగంలో ఉన్న దీన్ని సోమసూత్రం అంటారు. దాని కిందే చండీశ్వరుడు కొలువై ఉంటాడు. శివాలయంలోకి వెళ్లగానే నేరుగా శివుడి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు. ముందుగా నందీశ్వరుడి వ‌ద్ద ప్రదక్షిణ ప్రారంభించి ఈశ్వరుడి వద్దకు వెళ్లి ఆయ‌న్ను ద‌ర్శించుకుని మ‌ళ్లీ వెన‌క్కి రావాలి. ఇలా ఒకసారి చేస్తే 11 పర్యాయాలు చేసిన ఫలితం లభిస్తుందట.

:: దిండిగల్ ​ఆనంద్ శర్మ, సీనియర్​ జర్నలిస్ట్​
సెల్​నం.96660 06418