Breaking News

వ్యాక్సిన్​పై కీలక సమావేశం

కరోనా వ్యాక్సిన్​పై నేడు కీలకసమావేశం

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ విడుదల, పంపిణీపై కేంద్ర ఎక్స్ పర్ట్ కమిటీ కీలక సమావేశం జరుపనుంది. ఇండియాకు సరిపోయే వ్యాక్సిన్ ను ఎంపిక చేయడం, దాని తయారీ, డెలివరీలతో పాటు ముందుగా వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలన్న విషయాలపై ఈ కమిటీ చర్చించనుందని తెలుస్తోంది. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పౌల్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, వ్యాక్సిన్ తయారీ సంస్థలు భాగం కానున్నాయని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు. ఇదే ప్యానల్ లో విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్, డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కార్యదర్శి రేణుస్వరూప్, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ, ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా తదితరులు సభ్యులుగా ఉంటారు. కాగా, రష్యా చేసిన ప్రకటనపై స్పందించేందుకు ఆరోగ్య శాఖ నిరాకరించింది. రష్యా వ్యాక్సిన్ ను ఇండియాకు దిగుమతి చేస్తారా? అన్న ప్రశ్నపై భూషణ్ స్పందిస్తూ, వ్యాక్సిన్ ను అందుబాటులోకి తేవడం, తయారీకి అవసరమైన నిధులు, ఎన్ని డోస్ లు అవసరపడతాయి అనే విషయాలను చర్చించి నిర్ణయిస్తామని స్పష్టం చేశారు.

అంతర్గత చర్చల ద్వారానే ముందడుగు వేస్తామని, ఈ విషయంలో అందరి అభిప్రాయాలనూ తీసుకుంటామని అన్నారు. కాగా, ఇండియాలో ప్రస్తుతం మూడు వ్యాక్సిన్ లు క్లినికల్ ట్రయల్ దశలో ఉన్నాయన్న సంగతి తెలిసిందే. భారత్ బయోటెక్, కాడిలా హెల్త్ కేర్ వ్యాక్సిన్లు తొలిదశను పూర్తి చేసుకుని, రెండో దశలోకి ప్రవేశించాయి. ఈ రెండు సంస్థలూ స్వదేశీ పరిజ్ఞానంతోనే వ్యాక్సిన్ తయారు చేశాయన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో పుణె కేంద్రంగా నడుస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్, ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన వ్యాక్సిన్ మూడోదశ ట్రయల్స్ ను ఇండియాలో నిర్వహిస్తోంది.