- నేడు దేశవ్యాప్త బంద్కు పిలుపు
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల బిల్లులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా రైతు సంఘాలు నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా రాస్తారోకో, రైల్ రోకో వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నాయి. వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ ఇప్పటికే పంజాబ్, హర్యానా తో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల రైతాంగం కొద్దిరోజులుగా ఆందోళనలకు దిగుతున్న విషయం విదితమే. ఇక నేటి బంద్ ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కో ఆర్డినేషన్ కమిటీ (ఐకేఎస్ఎస్ సీ), ఆలిండియా కిసాన్ మహాసంఘ్ (ఏఐకేఎం), భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ఆధ్వర్యంలో కొనసాగనుంది. ఈ బంద్ కు కాంగ్రెస్ సహా 18 రాజకీయ పార్టీలతో పాటు 10 కార్మిక సంఘాలు మద్దతిచ్చాయి. బంద్ పై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ స్పందిస్తూ.. చట్టాన్ని గౌరవిస్తూ నిరసన తెలపాలని రైతులకు సూచించారు. ఎన్డీయే మిత్రపక్షం శిరోమణి అకాళీదల్ కూడా మద్దతు ప్రకటించింది. ఢిల్లీ తో పాటు యూపీ, బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక,కేరళ, తమిళనాడు, ఛత్తీస్ గడ్, తెలంగాణ లలో రైతులు పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొనే అవకాశం ఉంది.