Breaking News

విశ్వనగరాన్ని సురక్షితంగా ఉంచుదాం..

విశ్వనగరాన్ని సురక్షితంగా ఉంచుదాం..

* కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు
*
కంటైన్‌మెంట్‌ క్లస్టర్లపై స్పెషల్ ఫోకస్
*
ప్రతిరోజూ 25వేల మందికి ఆహార ప్యాకెట్లు
*
జీహెచ్‌ఎంసీ, పోలీసుశాఖకు సహకరించండి
* ‘సారథి ప్రతినిధి’తో హైదరాబాద్ మేయర్‌ బొంతు రామ్మోహన్‌

బొంతు రామ్మోహన్, హైదరాబాద్ మేయర్

‘కరోనా(కోవిడ్ 19) వ్యాప్తి నివారణకు బల్దియా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్ సెంటర్లకు పంపించాం. కరోనా పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా నివారణ చర్యలు తీసుకుంటున్నాం. మర్కజ్ వెళ్లొచ్చిన వారిని గుర్తించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు. లాక్డౌన్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా కూరగాయల కోసం మొబైల్ రైతు బజార్లు, పండ్ల మార్కెట్లను ఏర్పాటుచేశాం. అనాథలు, యాచకులు, వలస కార్మికులు ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకుండా ఉండేందుకు దాతల సహకారంతో బియ్యం, సరుకులు పంపిణీ చేస్తున్నాం. ఉచితంగా భోజనం సౌకర్యం, ఆహార ప్యాకెట్లు అందిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలో లాక్ డౌన్ను పకడ్బందీగా అమలు చేస్తున్నాం..’ అని హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. ఆదివారం ‘సారథి ప్రతినిధి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

సారథి: కరోనా మహమ్మారి ప్రపంచాన్నే వణికిస్తోంది. విశ్వనగరమైన హైదరాబాద్లో వ్యాధి ప్రబలకుండా నివారణ చర్యలు ఎలా ఉన్నాయి..?
మేయర్: విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 350 బృందాలను ఏర్పాటుచేశాం. ఇందులో వైద్యారోగ్యశాఖ, పోలీసు, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు. మర్కజ్ వెళ్లొచ్చిన వారిని గుర్తించేందుకు ప్రత్యేక అధికారుల బృందాలను నియమించాం. మొత్తంగా 12వేల మందిని గుర్తించి క్వారంటైన్ సెంటర్లకు పంపించాం. కుత్బుల్లాపూర్ లో నెలరోజుల పాపకు కాంటాక్టు ద్వారా పాజిటివ్ వచ్చింది. వీరిని గుర్తించేందుకు అధికారుల కృషి మరువలేనిది. నగర పరిధిలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నాం. జోన్కు మూడు వాహనాలు కేటాయించాం. గ్రేటర్ లో 709 కిలోమీటర్ల ప్రధాన రహదారి పరిధి మేర కరోనా వైరస్ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.

సారథి: కంటైన్ మెంట్ ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
మేయర్: కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ క్లస్టర్లుగా గుర్తించాం. 3కి.మీ. పరిధిని కలిపి 12 క్లస్టర్లను ఏర్పాటుచేశాం. దీంతో హైదరాబాద్ నగరం 40శాతం కవర్ అయింది. ఒక్కో క్లస్టర్లో ఐదువేల ఇండ్లు వరకు ఉన్నాయి. వీటి పరిధిని తగ్గించి క్లస్టర్ల సంఖ్యను పెంచుతాం. ఒక్కో క్లస్టర్ పరిధిలో 50, 100 ఇండ్లు ఉండేలా డిజైన్ చేస్తున్నాం. ఒక్కో పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు క్లస్టర్లు ఉంటాయి. వీటి పరిధిలో కరోనా అనుమానితుల నుంచి రక్తనమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించడం, నిరంతరం సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించడం, మెడికల్ ఎమర్జెన్సీ వంటి చర్యలు తీసుకుంటున్నాం. కంటైన్మెంట్ క్లస్టర్ ప్రాంతాల ప్రజలు ఇళ్లనుంచి బయటికి రావొద్దు. ఇతరులు లోపలికి వెళ్లడానికి అవకాశమే లేదు. ఆ ప్రాంతంలో ఏదైనా సమస్య ఉంటే ఫోన్ చేస్తే అధికారులే వెళ్తారు. క్లస్టర్ నోడల్ ఆఫీసర్ ఉంటారు. నిరంతరం నిఘా ఉంటుంది.

సారథి: లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు, యాచకులు, రోజువారీ కూలీల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..?
మేయర్: లాక్ డౌన్ కారణంగా ఇక్కడే ఉండిపోయిన ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు, ప్రైవేట్ ఉద్యోగులు, విద్యార్థులు, యాచకులు సుమారు 85వేలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వలస కార్మికులకు ఒక్కొక్కరికి 12 కేజీల బియ్యం, రూ.500 నగదు అందజేశాం. ఇంకా మిగిలిపోయిన వారి కోసం అధికారులు లిస్టు తయారుచేస్తున్నారు.
రెండవ దశలో కూడా అందజేస్తాం. 185 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా 60వేల మందికి మధ్యాహ్న భోజనం, రాత్రి 91 కేంద్రాల ద్వారా 30వేల మందికి భోజనం అందిస్తున్నాం. జీహెచ్ఎంసీ, ఎన్జీవో సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడొందల క్యాంపుల్లో కార్మికులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.

సారథి: ఆహార సేకరణ, పంపిణీ కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక విభాగాలకు స్పందన ఉంది..?
మేయర్: షెల్టర్ లేని వారి కోసం ఏర్పాటు చేసిన ఆహారం సేకరణ, పంపిణీ చేయడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగానికి భారీ స్పందన వస్తోంది. లాక్ డౌన్ ముగింపు వరకు ప్రతిరోజు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 25వేల మందికి ఆహారపు ప్యాకెట్లను పంపిణీ చేసేందుకు దాతలు ముందుకొచ్చారు. గుజరాత్ సేవామండలి ఆధ్వర్యంలో ఏడువేలు, వాసవి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఐదువేలు, లక్డికాపూల్ వైశ్య హాస్టల్ నుంచి ఐదువేలు, రాజస్థాన్ మర్వాడీ సంస్థ ఆధ్వర్యంలో ఐదువేలు పంపిణీ చేయడానికి ముందుకొచ్చారు. జీహెచ్ఎంసీ అనుమతితో 80 స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో 55వేల మందికి ఆహారం పంపిణీ చేస్తున్నాం.

సారథి: మొబైల్ కూరగాయలు, పండ్ల విక్రయ కేంద్రాలు ఎక్కడా కనిపించడం లేదు కదా.. నిత్యావసర సరుకుల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
మేయర్: నగరానికి రెండు వేల మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం. కాగా, ప్రతిరోజు 350 మొబైల్ రైతు బజార్ల ద్వారా 2,300 మెట్రిక్ టన్నుల కూరగాయలు సరఫరా చేస్తున్నాం.1200 కాలనీలను కవర్ చేస్తున్నాం. ఐదొందల ప్రాంతాల్లో పండ్ల విక్రయ కేంద్రాలను ఏర్పాటుచేశాం. నిత్యావసర సరుకుల ధరలు పెంచితే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయమని సీఎం కేసీఆర్ కూడా సూచించారు. అధికారులు కూడా ఆ దిశగా చర్యలు తీసుకునే పనిలో ఉన్నారు.
సారథి: పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్కిట్లు ఇవ్వలేదు. వాళ్లకు రక్షణ కల్పించడంలోనూ బల్దియా విఫలమైందనే విమర్శ ఉంది.. దీనికి మీరేమంటారు..?
మేయర్: పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్కిట్లు ఇవ్వడంలో ఆలస్యమైంది. కరోనా నివారణ చర్యల్లో భాగంగా తక్షణమే మాస్క్లు, గ్లౌస్లు, శానిటైజర్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించాం. స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా మాస్క్లు కుట్టిస్తున్నాం. గ్లౌస్ల కొరత ఉంది. అయినా సరే కార్మికులు అందరికి ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నాం.
సారథి: కరోనా నేపథ్యంలో హైదరాబాద్ నగర వాసులకు మీరిచ్చే సందేశం?
మేయర్: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మే 3వ తేదీ వరకు లాక్డౌన్ విధించాయి. దీన్ని నగరవాసులంతా భారంగా భావించొద్దు. ఇష్టంగా స్వీకరించాలి. టైం పాస్కు బయటికి రావద్దు. ఇంట్లోనే ఉండండి. గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్మెంట్లోకి కొత్తవాళ్లను రానీయడం లేదు. కానీ బస్తీల్లోనూ యువకులు కథానాయకులుగా మారాలి. ప్రజలకు అవగాహన కల్పించి ప్రభుత్వానికి సహకరించేలా కృషిచేయాలి. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, పోలీసు, జీహెచ్ఎంసీ ఆఫీసర్లకు సహకరించాలి. మనమంతా ఐక్యంగా ఉంటేనే ఎంతటి మహమ్మారినైనా ఎదుర్కొగలం.