- మద్యం మత్తులో యువతుల హల్ చల్
- బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూళ్లు
సారథి న్యూస్, ఎల్బీనగర్(రంగారెడ్డి): ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి పరిధిలోని కనకదుర్గ వైన్స్ పరిసరాల్లో ప్రతిరోజూ మద్యం మత్తులో ఉన్న కొంతమంది యువతులు హల్చేస్తున్నారు. నలుగురు యువతులు వైట్నర్ పీలుస్తూ, మద్యం తాగి వైన్స్ ఎదురుగా ఉన్న బస్టాప్‌లో తిష్టవేస్తున్నారు. వైన్స్ వద్దకు మద్యం కొనడానికి వచ్చే వారితో, రోడ్డుపై వెళ్లే వారితో సదరు యువతులు గొడవ పడుతూ నానా హంగామా సృష్టిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో యువతులు రెచ్చిపోతూ దారిన పోయే వారిపై దాడులకు పాల్పడుతూ డబ్బులను లాక్కుంటున్నారని స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి 9గంటల ప్రాంతంలో యువతులు మద్యం మత్తులో వైన్ షాప్ ముందు ఓ యువకుడిపై దాడి చేసి, అక్కడ బస్టాప్‌లో పడుకొని ఉన్న మరో యువకుడి బట్టలు ఊడదీసి డబ్బులు లాక్కున్నారు. దీంతో వారిద్దరూ భయంతో పారిపోయారు. రోడ్డుపై బహిరంగంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలికి పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో గొడవలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.