- మన పంటలకూ కీటకాల ముప్పు
- ఏపీలోని అనకాపల్లిలో పంటలపై దాడి
సారథి న్యూస్, హైదరాబాద్, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాలకు మరో ఆపద పొంచి ఉంది.. గంటకు 15కి.మీ వేగంతో మిడతల దండు దూసుకొస్తోంది. పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి కదిలిన లక్షలాది మిడతలు పంటలపై దాడిచేసి దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. లక్షలాది ఎకరాల్లో పంటలను తినేస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో లక్షల ఎకరాల్లో పంట ధ్వంసమైంది.
తాజాగా అవి మహారాష్ట్రలోని అమరావతిలోకి కూడా ప్రవేశించాయి. అక్కడి అధికారులు వీటిని పారదోలేందుకు నియంత్రణ చేర్యలు చేపడుతుండగా, వాటి నియంత్రణ సాధ్యం కావడం లేదు. క్రమంగా తెలంగాణలోకి వచ్చే అవకాశం కూడా వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో రైతాంగంలో కలవరం మొదలైంది. అప్రమత్తమైన వ్యవసాయ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, నిపుణలతో అత్యవసర సమీక్ష నిర్వహించారు.
సరిహద్దు జిల్లాల్లో రసాయనాలతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. రైతులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మిడతల దండు గంటకు 15కి.మీ. వరకూ ప్రయాణిస్తూ.. చెట్లపై నివాసం ఉంటూ.. పంటలకు నష్టం కలిగిస్తున్నాయని వెల్లడించారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, భూపాలపల్లి, నిర్మల్, కామారెడ్డి జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రతి గ్రామంలో రసాయానాలు సిద్ధం చేసుకోవాలని, ఈ విషయంలో రైతుల్లో అవగాహన పెంచాలని తెలిపారు. ఇదిలాఉండగా, తాజాగా విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నియోజకవర్గం కసింకోట మండలం అచ్చర్ల గోకువానిపాలెం గ్రామంలో పంటలపై మిడతల గుంపు దాడిచేసింది. రైతుల ఫిర్యాదుతో పంటలను హార్టికల్చర్ అధికారులు పరిశీలించారు. పురుగు మందు చల్లాలని రైతులకు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ రైతాంగంలో మరింత ఆందోళన నెలకొంది.
పంపించకపోతే నష్టమే
పంటలను నాశనం చేస్తున్న మిడతల దండు 1993 తర్వాత మహారాష్ట్ర వైపు వచ్చిందని అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఏటీఏఆర్ఐ) ఎక్స్ జోన్ డైరెక్టర్ డాక్టర్ వైజీ ప్రసాద్ తెలిపారు. మిడతలు ప్రతి రోజు ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటుందని, తన బరువుకు సమానమైన ఆహారం తీసుకునే జీవిగా వెల్లడించారు. దీనికి తోడు వాటిలో సంతానోత్పత్తి కూడా వేగంగా జరుగుతుందని అన్నారు. ఈ లెక్కన చూస్తే వాటిని త్వరగా వెనక్కి పంపించకపోతే.. పాక్ నుంచి వచ్చిన మిడతల సంఖ్య దాదాపుగా 400 రేట్లు పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
- మిడతలతో నష్టాలివే..
- పంటలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.
- కేవలం మొక్కలను మాత్రమే ఆరగిస్తాయి.
- గుంపులుగా దండెత్తితే పైరు ఆనవాళ్లు కూడా కనిపించవు
- రోజులో 150 కి.మీ వరకు ప్రయాణిస్తాయి.
- కి.మీ పరిధి ప్రాంతాన్ని 8 కోట్ల మిడతలు ఆక్రమిస్తాయి.
- 35వేల మంది సరిపోయే ఆహారాన్ని ఒక్కరోజులోనే తినేస్తాయి.