విలన్ గా నటించేందుకు హీరో లతో సమానంగా హీరోయిన్లు కూడా రెడీ అయిపోతున్నారు. ‘నరసింహా’ సినిమాలో నీలాంబరిగా రమ్యకృష్ణ పెర్ఫామెన్స్ అదుర్స్. రీసెంట్గా తమిళ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నెగిటివ్ రోల్స్ ను అదరగొట్టేస్తోంది. ఇప్పుడు తమన్నా నితిన్ మూవీ ‘అంధాదూన్’ రీమేక్‌లో నెగిటివ్ రోల్ చేసేందుకు రెడీ అయింది. అయితే ఇప్పుడు ఇంకో హీరోయిన్ కూడా ఈ బాటే పట్టడానికి సిద్ధమవుతోందట. ‘సీమటపాకాయ్’, ‘అవును’ లాంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన పూర్ణ. ఇప్పుడో తెలుగు సినిమాలో నెగిటివ్ రోల్ పోషించనుందట.
రాజ్ తరుణ్ హీరోగా విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రూపొందిన ‘ఒరేయ్ బుజ్జిగా’ అక్టోబర్ 2న ఓటీటీ ద్వారా విడుదలవుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇటీవల మరో సినిమా ప్రారంభమైంది. వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై అనంత్ నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ లో నెగిటివ్ టచ్ ఉండే పాత్ర కోసం అన్వేషిస్తున్న టీమ్ పూర్ణ ఆ పాత్రకు కరెక్ట్ అని భావించారట. గ్లామర్ తో పాటు పెర్ఫామెన్స్ కూడా అదరగొడుతుంది పూర్ణ. అందుకే తనని ఎంచుకున్నారంటున్నారు. పూర్ణ కూడా ఈ మూవీకి సైన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ లేడీ విలన్ రోల్ కోసం తన లుక్ కూడా మార్చుకోబోతుందట. ఇక తలైవి, లాకప్, 100 లాంటి మరికొన్ని చిత్రాల్లోనూ ఆమె నటిస్తోంది.