చిలిపి అమ్మాయిగా, అల్లరి పిల్లగా ‘సరిలేరు నీకెవ్వరు’లో మహేష్ పక్కన నటించింది.. మెచ్యూరిటీ ఉన్న అమ్మాయిగా నితిన్ తో కలిసి ‘భీష్మ’లో పార్టనర్ షిప్ కలిపింది. రెండు సినిమాలు రష్మికకు మంచి నేమ్ తెచ్చాయి. చాలా తక్కువ టైమ్లో స్టార్ హీరోయిన్ అయిపోయి మంచి చాన్స్లనే దక్కించుకుంటోంది. ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది. అలాగే చిరు, కొరటాల కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఆచార్య’లో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనుండగా, చెర్రీకి జోడీగా రష్మిక చాన్స్ దక్కించుకుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఇప్పుడు మరో మెగా హీరోకు జంటగా కనిపించనుందనే టాక్ వినిపిస్తోంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా అల్లు బాబీ ఓ స్పోర్ట్స్ డ్రామాను నిర్మిస్తున్నాడు.
‘బాక్సర్’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా మొదట బాలీవుడ్ హీరోయిన్ సయీ మంజ్రేకర్ ను తీసుకోవాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఎందుకో.. ఏమో ఆమె స్థానంలో రష్మికను తీసుకోవాలని దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారట. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు రష్మిక పేరు ఇంకా కొన్ని సినిమాలకు వినిపిస్తోంది. తాజాగా అక్కినేని అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఓ మూవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అఖిల్ సరసన రష్మికను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరిగింది. ఇదిలాఉండగా కన్నడలో రష్మిక నటించిన ‘పొగరు’ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. అలాగే తమిళ్ లో కార్తీ సరసన ‘సుల్తాన్’ సినిమాలో నటిస్తోన్న రష్మిక ఓ స్టార్ హీరో సరసన మరో తమిళ మూవీలోనూ చాన్స్ దక్కించుకుందని టాక్. వరుస సినిమాలతో క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటూ ఒక్కసారిగా టాలీవుడ్ లక్కీ గాళ్ అయిపోయింది రష్మిక.