Breaking News

లంక లేదా యూఏఈలో ఐపీఎల్​

న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్​లో ఐపీఎల్​ జరిగే అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నాయని మాజీ కెప్టెన్​ సునీల్​ గవాస్కర్​ అన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లీగ్​ను నిర్వహించడం పెద్ద తలనొప్పితో కూడుకున్న వ్యవహారమన్నాడు. అయితే సెప్టెంబర్​లో శ్రీలంక లేదా యూఏఈలో మెగా టోర్నీని నిర్వహించేందుకు అనుకూలంగా ఉంటుందన్నాడు. ‘స్టేడియాల్లోకి అభిమానులను అనుమతిస్తూ ఆసీస్​ నిర్ణయం తీసుకోవడంతో టీ20 ప్రపంచకప్​పై ఆశలు మొలకెత్తుతున్నాయి. అక్టోబర్​లో ఈ మెగా ఈవెంట్​ ఉంటే అంతకంటే ముందుగానే అన్ని జట్లు అక్కడికి వెళ్తాయి. క్వారంటైన్​, ఇతరత్రా అన్ని పూర్తి చేసుకుని టోర్నీకి సిద్ధమవుతారు. కాబట్టి ప్రపంచకప్​పై ఐసీసీ ముందడుగు వేస్తే ఐపీఎల్​ జరగడం అసాధ్యం. ఇక సెప్టెంబర్​లో భారత్​లో వర్షకాలం. మ్యాచ్​లు సాధ్యం కాదు. కాబట్టి లంక, యూఏఈలో ఒకదానిని ఎంచుకోవచ్చు. కాకపోతే మ్యాచ్​ల సంఖ్య తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి’ అని గవాస్కర్​ వివరించాడు.