- కామాంధులకు బలవుతున్న భారతీయ వనితలు వీళ్లు
- దేశంలో మహిళలపై పెరుగుతున్న లైంగికదాడులు
- గతేడాది 32వేల మంది బాధితులు
- నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడి
న్యూఢిల్లీ : స్త్రీని దేవతగా పూజించే దేశంలో మహిళలకు రక్షణ కరువవుతోంది. దేశంలో ఇక్కడా అక్కడా అని తేడా లేకుండా ఏ మూలకెళ్లినా మన స్త్రీలకు భద్రత లేదన్నది స్పష్టమవుతోంది. ఒక్కటి కాదు.. రెండు కాదు.. దేశంలో రోజుకు ఏకంగా 88 మంది మన తల్లులు, అక్కాచెళ్లెల్లు కామాంధుల కాటుకు బలవుతున్నారు. ఆ ధృతరాష్ట్ర కౌగిలిలో నలిగి.. చస్తూ బతికేవాళ్లు కొందరైతే.. ఆ గాయాలను మరువలేక, సమాజపు సూటి మాటలు భరించలేక, నొప్పులను ఓర్చుకోక ప్రాణాలు విడిచేవాళ్లు ఎందరో..! ఇక ఈ జాబితాలో లైంగికదాడులకు గురవుతున్న దళిత మహిళలు రోజుకు 11 మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా గతేడాది 32,033 మంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. (ఇవి అధికారిక లెక్కలే. లెక్కలోకి రానివి లెక్కేలేదు) అంటే రోజుకు 88 మంది చొప్పున మన మహిళలు లైంగికదాడులకు బలవుతున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. గత పదేళ్లలోనూ దేశంలో మహిళలపై లైంగికదాడులు గత దశాబ్దంతో పోల్చితే 44శాతం పెరిగాయి.
దళితులపై దారుణాలు
నిచ్చెన మెట్ల కులవ్యవస్థ వేళ్లూనుకుపోయిన భారతదేశంలో.. దళితులంటే ఇప్పటికీ చిన్నచూపే. ఇక దళిత మహిళలపై జరిగే అకృత్యాలకు అంతే లేదు. దేశంలో రోజుకు 11 మంది దళిత బిడ్డలు రేపునకు గురవుతున్నారు. దేశంలో మొత్తంగా 32వేలకు మంది పైగా బాధితులు ఉంటే వారిలో 11శాతం మంది.. అంటే 3,523 మంది దళిత బిడ్డలే. ఇందులో ఒకటింట మూడో వంతు దారుణాలు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లోనే జరుగుతున్నాయి. భూస్వాములు, అగ్రవర్ణాలు, పెత్తందారి వర్గాల కాళ్ల కింద దళిత యువతులు అత్యంత హేయంగా అణిచివేయబడుతున్నారు. రెండ్రోజుల క్రితమే యూపీలోని హత్రాస్ లో దళిత యువతిపై అతి కిరాతకంగా లైంగికదాడికి పాల్పడిన ఉన్నతవర్గాల దుండగులు.. ఆ పై బలరామ్పూర్లోనూ మరో దళిత బిడ్డను పొట్టన పెట్టుకున్నారు. గడిచిన నెలలోనే యూపీలో ఐదుగురు దళిత యువతులు అత్యాచార బాధ్యులు అయ్యారంటే అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
రాజస్థాన్‌లోనూ..
యూపీలో మాదిరే రాజస్థాన్‌లోనూ మహిళలపై పెద్ద ఎత్తున అత్యాచారాలు జరుగుతున్నాయి. 2019లో నమోదైన మొత్తం కేసులలో ఆ రాష్ట్రం నుంచే 6వేల కేసులు ఉండడం గమనార్హం. ఈ కేసుల్లో 9శాతం మంది దళితులే ఉన్నారు.
గత పదేళ్లలో..
సాంకేతికత పెరుగుతున్న కొద్దీ మనుషులు మృగాలుగా మారుతున్నారో లేక వారిలో ఇంటర్నెట్ వారిలో లైంగిక వాంఛలు పెంచుతున్నదో లేక మరే కారణమో గానీ.. గడిచిన పదేళ్లలో భారత్‌లో స్త్రీలపై దారుణాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. 2010 నుంచి 2019 దాకా దేశంలో మహిళలపై జరిగిన లైంగికదాడుల కేసులు 3 లక్షల (3,13,289)పైనే ఉన్నాయి. ఇది అంతకుముందు దశాబ్దంతో పోల్చితే 44 శాతం ఎక్కువ. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఘటన తర్వాత.. భారత్‌లో మహిళలపై లైంగికదాడులు మరింత పెరిగాయి. 2013-19 మధ్య కాలంలో 2.42 లక్షల అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఈ ఏడేళ్లలో దేశంలో రోజుకు 95 మంది.. గంటకు నలుగురు భారతీయ వనితలు మదమెక్కిన మగ పుంగవుల చేతిలో నలిగిపోతున్నారు.
దేశంలో ఇంత జరుగుతున్నా.. మన ప్రభుత్వాలు స్త్రీల సమానత్వం, వారి హక్కులు, దళితుల అభ్యున్నతి వంటి పాత చింతకాయ పచ్చడి మాటలే మాట్లాడుతుండడం సిగ్గుచేటు. లైంగికదాడుల్లో నిందితులు చట్టాల్లోని లొసుగులు, అధికార పార్టీల అండదండలు చూసుకుని.. ఇలా జైలుకెళ్లి అలా బయటకొస్తున్నారు. చిన్నారులపై రేప్ చేస్తే పోస్కో చట్టాల కింద కేసులు పెడతామనీ, వారిని ఉరి తీస్తామని చెబుతున్న మాటలు నీటి మూటలే అవుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీల మీదే ఈ తరహా కేసులు ఉన్నాయి.