Breaking News

రొమాంటిక్ కపుల్

రొమాంటిక్ కపుల్

రవితేజ పోలీస్ ఆఫీసర్ గా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘క్రాక్’. శృతిహాసన్ హీరోయిన్. ఈ మూవీలోని పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది టీమ్. బి.మధు నిర్మాత. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే ‘భూమ్ బద్దలు, భలేగా తగిలావే బంగారం’ పాటలు రిలీజ్ చేసిన మేకర్స్ శుక్రవారం క్రిస్మస్ సందర్భంగా మరో సాంగ్ విడుదల చేశారు. ఈ రెండు పాటలూ రవితేజ తన స్టెప్పులతో అదరగొట్టగా ఇప్పుడు రిలీజైన ‘కోరమీసం పోలీసోడా’ సాంగ్ రొమాంటిక్ గా సాగింది. ‘ఏ జన్మలో నీకు ఏ మందు పెట్టిందో.. నీ జంట కట్టింది ఒంటి మీద ఖాకీ.. అసలంటూ తానంటూ నీ కొరకే పుట్టిందో.. నీ తలుపు తట్టింది ఏరి కోరి వెతికీ’ అంటూ రవితేజతో ఆయన భార్యగా నటించిన శృతిహాసన్ రొమాంటిక్ గా పాడే పాట ఆకట్టుకుంటుంది. ‘నీ అండ చూసింది నెత్తెక్కి కూర్చుంది నన్నెల్లి పొమ్మంది సవతి.. రవ్వంత నీపక్క చోటివ్వనంటుంది పొట్లాట కొస్తోంది దండెత్తి.. ఆ సంగతేందో ఓ కాస్తా నువ్వే తేల్చుకోరా పెనిమిటీ’ అంటూ భర్త ఎంత సిన్సియర్ పోలీసాఫీసర్ అనేది చెబుతూ రామజోగయ్యశాస్త్రి రాసిన లిరిక్స్ ని రమ్య బెహరా చక్కగా పాడింది. గోపిచంద్ మలినేని, రవితేజ కాంబోలో రానున్న మూడో సినిమా కావడంతో అంచనాలు పెరిగాయి. వాస్తవ సంఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ లాస్ట్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీని జనవరి 14న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.