సారథి న్యూస్, రామడుగు, మహబూబ్ నగర్: రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల మంగళవారం సాయంత్రం అకాలవర్షం రైతన్నలను ఆగమాగం చేసింది. చేతికొచ్చిన పంట నీటిపాలైంది. మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన ధాన్యం తడిసి పోయింది. అలాగే పిడుగు పాటు వణికించింది.
కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం నీట తడిసి ముద్దయింది. ఆరబోసిన ధాన్యం సైతం కొట్టుకుపోయింది. పొలాల్లో కోతలకు ఉన్న వరి నేలకొరిగింది.
అసలే మిల్లర్ల నిలువు దోపిడీతో సతమతమవుతున్న రైతులపై వరుణుడు కన్నెర్ర చేశాడు. కోత దశలో ఉన్న మామిడి కాయలు నేలరాలడంతో తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ రూరల్ మండలం మాచన్ పల్లి తండాలో పిడుగు పాటుకు భీముల(46), సరోజ(40) దంపతులు మృతిచెందారు. మృతులు వ్యవసాయ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ ఘటనతో తండాలో విషాదం నెలకొంది.