- యాసంగి సీజన్ కోసం రూ.7,515 కోట్ల సాయం
- ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు
సారథి న్యూస్, హైదరాబాద్: ఈనెల 28వ తేదీ (సోమవారం) నుంచి వచ్చేనెల(జనవరి-2021) వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రైతుబంధు నగదు పంపిణీపై ముఖ్యమంత్రి ఆదివారం ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ రకాల పంటల కొనుగోళ్లు, నియంత్రిత సాగువిధానం, రైతుబంధు అమలు, మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు.. కొనుగోళ్లు, రైతుబంధు సమితుల బాధ్యతలు, రైతు వేదికల వినియోగం తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో 61.49 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.ఐదువేల చొప్పున 2020 యాసంగి సీజన్ కోసం ప్రభుత్వం రూ.7,515 కోట్లను పంటసాయంగా అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని ఏ ఒక్కరైతూ మిగలకుండా ప్రతి ఎకరానికీ డబ్బులు నేరుగా బ్యాంకులో జమచేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
పంటల కొనుగోళ్లతో నష్టం
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి ప్రభుత్వం చేపట్టిన వివిధ రకాల పంటల కొనుగోళ్ల వల్ల చాలా నష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. వరి ధాన్యం, మక్కలు, జొన్నలు, కందులు, శనిగలు, పొద్దు తిరుగుడు పువ్వు, మినుములు తదితర పంటల కొనుగోళ్ల వల్ల ఇప్పటివరకు దాదాపు రూ.7,500 కోట్ల వరకు నష్టం వచ్చిందని చెప్పారు. రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసినప్పటికీ ఆ పంటలకు మార్కెట్లో డిమాండ్ లేకపోవడం వల్ల ప్రభుత్వం తక్కువ ధరకు అమ్మాల్సి వస్తోందని, దీనివల్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు వివరించారు. కేవలం ధాన్యం కొనుగోళ్ల వల్లనే రూ.3,935 కోట్ల నష్టం వచ్చిందని వివరించారు. మక్కల కొనుగోళ్ల వల్ల రూ.1547.59 కోట్లు, జొన్నల ద్వారా రూ.52.78 కోట్లు, కందుల ద్వారా రూ.413.48 కోట్లు, ఎర్రజొన్నల ద్వారా రూ.52.47 కోట్లు, మినుముల ద్వారా రూ.9.23 కోట్లు, శనిగల ద్వారా రూ.108.07 కోట్లు, పొద్దుతిరుగుడు కొనుగోళ్లతో రూ.14.25 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు వివరించారు. ఇలా నికరంగా వచ్చిన నష్టంతోపాటు హమాలీ, ఇతర నిర్వహణ ఖర్చులన్నీ కలుపుకుంటే రూ.7,500 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు అధికారులు చెప్పారు.
రైతుబీమా కిస్తీ పెరిగింది
తెలంగాణలో వ్యవసాయం బాగా విస్తరిస్తోంది. వ్యవసాయశాఖ అనేక పనులు నిర్వహించాల్సి వస్తోంది. వ్యవసాయ అధికారులపై ఇతర బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. రైతులకు ప్రతిఏటా రెండుసార్లు రైతుబంధు పంటసాయం అందించే పనులను వ్యవసాయ అధికారులు చూడాలి. రైతు బీమాను పకడ్బందీగా అమలు చేయాలి. రైతుబీమా కార్యక్రమం ప్రారంభించిన నాడు కేవలం రూ.630 కోట్ల కిస్తీ మాత్రమే చెల్లించాల్సి వచ్చేది. కానీ, చాలామంది రైతులు తమ కుటుంబ సభ్యులందరికీ బీమా వర్తింపజేయాలనే ఉద్దేశంతో తమకున్న భూమిని కుటుంబ సభ్యుల పేర రిజిస్టర్ చేయించారు. దీంతో రైతుల సంఖ్య పెరిగింది. ప్రీమియం దాదాపు రెట్టింపైంది. కిస్తీ ఏడాదికి రూ.1,144 కోట్లు కట్టాల్సి వస్తున్నది. అయినప్పటికీ ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించాలనే నిర్ణయించుకుంది. వ్యవసాయ అధికారులే రైతుబీమా పథకం అమలును పర్యవేక్షించాల్సి ఉందని అన్నారు. సమావేశంలో మంత్రులు కె.తారక రామారావు, ఎస్.నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు, జనార్దన్ రెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్ రావు, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఏడీఏ విజయ్ కుమార్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.