సారథి న్యూస్, హుస్నాబాద్: కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో రైతులు తమపంట పొలాల్లో పాలేర్లుగా మారే అవకాశం ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హుస్నాబాద్‌లో భారీర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ఐకేపీ కొనుగోలు సెంటర్లను నిర్వీర్యం చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయడం ద్వారా మహిళా సంఘాలు, హమాలీలు ఉపాధి కోల్పోతారని వివరించారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులతో రైతులు ఆరుగాలం పండించిన ధాన్యాన్ని సమీపంలో ఉన్న మద్దతు ధరకు అమ్ముకునే అవకాశాన్ని కోల్పోతారని అన్నారు. దేశవ్యాప్తంగా రైతులకు మద్దతుగా అఖిలపక్షం నాయకులు తలపెట్టిన భారత్ బంద్ కు సీఎం కేసీఆర్ మద్దతు తెలిపి ఇప్పుడు నోరుమెదపడం లేదని ధ్వజమెత్తారు. అనంతరం హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసి తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో నాయకులు బొమ్మ శ్రీరాంచక్రవర్తి, డీసీసీ అధికార ప్రతినిధి లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, నియోజకవర్గంలోని మండలాధ్యక్షులు శ్రీనివాస్, అయిలయ్య, కౌన్సిలర్లు సరోజన, రాజు, కిష్టస్వామి, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
- January 4, 2021
- Archive
- Top News
- తెలంగాణ
- CM KCR
- HUSNABAD
- PONNAM PRABHAKAR
- TPCC
- ఎంపీ పొన్నం ప్రభాకర్
- టీపీసీసీ
- తెలంగాణ
- సీఎం కేసీఆర్
- హుస్నాబాద్
- Comments Off on రైతులను పాలేర్లుగా మార్చొద్దు: పొన్నం