Breaking News

రైతులకు రూ.51కోట్ల ధాన్యం చెల్లింపులు

రైతులకు రూ.51కోట్ల ధాన్యం చెల్లింపులు

సారథి న్యూస్, మెదక్: జిల్లాలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 16,971 మంది రైతుల నుంచి 51,746 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.51కోట్లను వారి ఖాతాలో జమచేశామని మెదక్​ జిల్లా కలెక్టర్ హనుమంతరావు చెప్పారు. కొనుగోలు కేంద్రాలకు వస్తున్న సన్నరకం ధాన్యాన్ని కూడా కొని మిల్లులకు తరలిస్తున్నామని, ఇందులో ఎలాంటి ఇబ్బందుల్లేవని, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు కూడా ఆదేశాలిచ్చామని కలెక్టర్ తెలిపారు. గురువారం తన ఛాంబర్ లో అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ.. రైతులను ఇబ్బంది పెట్టకుండా కోనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఎంట్రీ చేస్తూ మిల్లుల నుంచి అకనాలెడ్జ్ మెంట్ తెప్పించుకుని ఓపీఎంఎస్​లో నమోదు చేయాలని కలెక్టర్ ఎం.హనుమంత రావు అధికారులకు సూచించారు. సన్నరకం ధాన్యాన్ని తీసుకోని మిల్లులకు నోటీసులు ఇవ్వాలని అధికారులకు సూచించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేస్తూ రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీవో శ్రీనివాస్, ఆర్డీవో సాయిరామ్, జిల్లా వ్యవసాయ అధికారి పరశురాం నాయక్, జిల్లా సహకార అధికారి పద్మ పాల్గొన్నారు.