Breaking News

రైతులకు మేఘసందేశం

రైతులకు మేఘసందేశం

  • రైతుల కోసం ప్రత్యేకంగా ‘ మేఘదూత్’ యాప్
  • వాతావరణం, సాగు పద్ధతులపై పూర్తి సమాచారం
  • అన్నదాతలకు అందుబాటులో మరిన్ని యాప్ లు

సారథి న్యూస్, రామాయంపేట: వ్యవసాయానికి టెక్నాలజీని జోడిస్తే మరింత అభివృద్ధిని సాధించవచ్చు. ఈ ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం రైతులకు పంటల సాగుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించేందుకు ‘మేఘ్​ధూత్​’ పేరుతో సరికొత్త యాప్​ను ఆవిష్కరించింది. ఈ యాప్ సాయంతో వ్యవసాయంలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు, ఎరువుల వాడకం.. తదితర అంశాలపై కూడా సూచనలు, సలహాలు అందించనున్నారు. ప్రధానంగా వాతావరణ మార్పులు, రుతుపవనాలు పంటలపై ప్రభావం చూపుతున్నాయి. అకాలవర్షాలు, ఈదురు గాలులు, వరదలతో పాటు చలి గాలులు వీస్తుండడంతో పంటలపై తీవ్రప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు ‘మేఘ్ ధూత్’ యాప్ ను ఆవిష్కరించారు.
యాప్ ఆవిష్కరణ
ఈ యాప్ ను భూశాస్త్ర మంత్రిత్వశాఖ, భారతీయ ఉష్ణమండల వాతావరణ విజ్ఞానసంస్థ, భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థతో పాటు ఇక్రిశాట్ సంయుక్తంగా రూపొందించాయి. ప్రొఫెసర్​ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహకారంతో పొందుపరుస్తూ రైతులకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నారు.

మేఘదూత యాప్​లోని వివరాలు

యాప్ లోని ప్రత్యేకతలు
–రాష్ట్రంలోని జిల్లాలకు సంబంధించిన వర్షపాతం, ఉష్ణోగ్రతలు, గాలిలో తేమశాతం, గాలి దిశ, మేఘాలు కమ్ముకోవడం వంటి వివరాలను వచ్చే ఐదు రోజులకు అందిస్తుంది.
–పంటలకు సోకే చీడపీడలు, తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు తెలియజేస్తుంది.
–ఒక్క వాతావరణమే కాకుండా వ్యవసాయ పంటలు, ఉద్యాన పంటలు, పశువులు, కోళ్ల పెంపకానికి సంబంధించిన వివరాలను పొందుపర్చానున్నారు.
– యాప్ సహాయంతో వారానికి రెండుసార్లు(మంగళ,శుక్రవారం)వ్యవసాయానికి సంబంధించి సూచనలు అందించనున్నారు.
– యాప్ లోని సమాచారాన్ని ఇతర రైతులకు అందించడానికి ఫేస్ బుక్, వాట్సప్ ఇతర సోషల్ మీడియాలో పంపించేలా చర్యలు చేపట్టనున్నారు.