- దేశంలో కరోనా టీకాలకు అయ్యే ఖర్చు
- కేంద్రాన్ని ప్రశ్నించిన సీరం ఇనిస్టిట్యూట్ సీఈవో
న్యూఢిల్లీ : దేశంలో నానాటికీ విజృంభిస్తున్న కరోనాను అంతమొందించడానికి దేశీయంగా పలు ఫార్మా సంస్థలు వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా..? టీకా వచ్చినా అది ముందుగా ఎవరికి ఇవ్వాలి..? పంపిణీ ఎలా..? దానికోసమయ్యే ఖర్చు..? అనేదానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీరం ఇనిస్టిట్యూట్ సీఈవో అదర్ పూనావల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించాలంటే రూ.80వేల కోట్లు ఖర్చు అవుతుందనీ, అంతమొత్తాన్ని భరించే స్థితిలో ప్రభుత్వం ఉందా? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
భారత్‌కు చెందిన సీరం.. ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్ తయారుచేస్తున్న కోవిషెల్డ్, ఆస్ట్రాజెనిక టీకాలకు సంబంధించి జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్‌లో భాగమవుతోంది. మూడో దశకు చెందిన ఈ పరీక్షలు.. భారత్‌లోనూ జరుగుతున్నాయి. కాగా, ట్విట్టర్ వేదికగా అదర్ స్పందిస్తూ.. దేశవాసులందరికీ టీకాలు అందించాలంటే రూ.80వేల కోట్ల ఖర్చవుతుందనీ, దీనిని కొనుగోలు చేసి పంపిణీ చేయడం ఇప్పుడు దేశం ముందున్న అతిపెద్ద సవాల్ అని అన్నారు. మన దేశ అవసరాల కోసం తగిన ప్రణాళిక, సంసిద్ధత ఎంతో ముఖ్య అదర్ ట్వీట్ చేశారు. జూన్‌లో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒక్కో టీకాకు వెయ్యి రూపాయల దాకా ఖర్చవుతుందని చెప్పిన విషయం విదితమే.