సారథి న్యూస్, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రంలోని పట్టణాలకు రావాల్సిన గ్రాంట్లకు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు శనివారం లేఖ రాశారు. 15వ ఆర్థిక సంఘం తెలంగాణలోని మిలియన్ ప్లస్ నగరాల కేటగిరీలో ఉన్న హైదరాబాద్ కు రూ.468 కోట్లు, ఇతర పట్టణాలకు రూ.421కోట్లు కేటాయించిందని, వీటిని ఇప్పటికే విడుదల చేయాల్సి ఉందని పేర్కొన్నారు. తెలంగాణలోని పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున కార్యక్రమాలు తీసుకుందని, వీటికి సంబంధించి కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు సంబంధించిన మ్యాచింగ్ గ్రాంట్ ను కూడా రాష్ట్ర బడ్జెట్లో కేటాయించినట్లు తెలిపారు.
గతంలో 14వ ఆర్థిక సంఘం సూచించిన రూ.2,714 కోట్లకు బేసిక్ గ్రాంట్ కు గానూ కేంద్రం కేవలం రూ.2,502 కోట్లు మాత్రమే విడుదల చేసిందని, అప్పుడు కూడా రూ.208 కోట్ల నిధులను కేంద్రం రాష్ట్రానికి చెల్లించలేదన్నారు. కేంద్రం నుంచి హైదరాబాద్ కు రావాల్సిన రూ.468 కోట్లు, ఇతర పట్టణాలకు రావాల్సిన రూ.315 కోట్లు, 14వ ఆర్థిక సంఘానికి సంబంధించి రూ.650 కోట్లు మొత్తంగా సుమారు రూ.1,434 కోట్లను వెంటనే విడుదల చేయాలన్నారు. మంత్రి తన లేఖను కేంద్ర పట్టణాభివృద్ధి హౌసింగ్ శాఖ మంత్రి హరీ దీప్ సింగ్ పూరికి కూడా పంపించారు.