Breaking News

రూ.లక్ష కోట్లతో అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌

రూ.లక్ష కోట్లతో అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌

  • గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు మౌలిక సదుపాయాలు
  • వ్యవసాయంలో సార్ట్​ అప్స్ కు మంచి అవకాశాలు
  • రైతులకు వరాలు ప్రకటించిన ప్రధాని నరేంద్రమోడీ

న్యూఢిల్లీ: రైతులకు మౌలిక సదుపాయలు కల్పించేందుకు రూ.లక్ష కోట్ల వ్యయంతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి(అగ్రి-ఇన్‌ఫ్రా ఫండ్‌)ని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. వ్యవసాయంలో ప్రధానమైన నాగలిని ఆయుధంగా కలిగి ఉండే బలరాముడి జయంతి సందర్భంగా ఆదివారం ఈ పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. పంట ఉత్పత్తి తర్వాత అవసరమైన గోదాంలు వంటి వసతులు మెరుగుపడతాయని చెప్పారు. కొత్త ఉద్యోగాలు వస్తాయని, రైతులకు మేలు జరుగుతుందున్నారు. వ్యవసాయంలో సార్ట్​అప్స్ కు మంచి అవకాశాలు ఉంటాయన్నారు. గుజరాత్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌కు చెందిన తొలి లబ్ధిదారులైన రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని మోడీ మాట్లాడారు. నిత్యావసరాలను పరిమితికి మించి నిల్వ ఉంచుకోవద్దని పేర్కొనే ఎసెన్షియల్‌ కమాడిటీస్‌ చట్టం(ఈసీ యాక్ట్‌) ఇప్పుడు అవసరం లేదని, గ్రామీణ ప్రాంతాల్లో మంచి గోదాంలు నిర్మించుకునేందుకు ఈ చట్టం ప్రతిబంధకంగా ఉందన్నారు. వ్యాపారులు, పెట్టుబడిదారులను బెదిరించేందుకు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేశారని, ఇప్పుడు వారికి ఆ భయాలేమీ అక్కర్లేదని, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద క్రెడిట్‌ సౌకర్యాలు కల్పించవచ్చన్నారు.
రూ.17వేల కోట్ల పీఎం కిసాన్ ​ఫండ్స్​ రిలీజ్​
ఈ పథకం అమలు కోసం 11 ప్రభుత్వ రంగ బ్యాంకులతో కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రైమరీ అగ్రికల్చర్‌ క్రెడిట్‌ సొసైటీ (పీఏసీఎస్)ల ద్వారా రైతులకు నిధులు మంజూరు చేస్తారు. కాగా పీఎం కిసాన్‌ పథకం కింద 8.5 కోట్ల మంది రైతులకు రూ.17వేల కోట్లను మోడీ విడుదల చేశారు. రైతుల ఆర్థిక అవసరాలను తీర్చే పీఎం కిసాన్‌ పథకం విజయవంతమైందని ఆయన చెప్పారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం
అగ్రి-ఇన్‌ఫ్రా ఫండ్‌.. రైతులకు మేలు చేస్తుందని, ఉద్యోగాలను సృష్టిస్తుందని, గ్రామాలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు ఉపయోగపడుతుందని హోంమంత్రి అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. 
అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో కీలక ప్రాజెక్టులు
ఆత్మ నిర్భర భారత్‌ కార్యక్రమానికి అండమాన్‌, నికోబార్‌ దీవులు ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆ దీవులకు సబ్‌మరైన్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ సౌకర్యాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో అక్కడి బీజేపీ కార్యకర్తలతో మోడీ మాట్లాడారు. సముద్ర వ్యాపారం కోసం అండమాన్‌, నికోబార్‌ దీవుల్లోని 12 దీవులను కీలక ప్రాజెక్టుల కోసం ఎంపిక చేశామని చెప్పారు. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, పలు రాష్ట్రాల రైతులు పాల్గొన్నారు.

One thought on “రూ.లక్ష కోట్లతో అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌”

Comments are closed.