Breaking News

రాష్ట్రానికి 600 వెంటిలేటర్లు

రాష్ట్రానికి 600 వెంటిలేటర్లు
  • ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చూపించుకోవాలి
  • కరోనా నుంచి ప్రజలే తమను తాము కాపాడుకోవాలి
  • గాంధీ ఆస్పత్రిని సందర్శించి కేంద్రమంత్రి కిషన్​రెడ్డి

సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా పాజిటివ్‌ వచ్చిన ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి కోరారు. గచ్చిబౌలి టిమ్స్ ను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం ఆయన హైదరాబాద్​లోని గాంధీ ఆస్పత్రిని సందర్శించి రోగులను పరామర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం‌ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టంచేశారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో టెస్టులు తక్కువగా జరుగుతున్నాయని వివరించారు. తెలంగాణలో పరిస్థితులపై మంత్రి ఈటల రాజేందర్, అధికారులతో మాట్లాడానని వెల్లడించారు.

ఢిల్లీ, ముంబై, చెన్నై తర్వాత హైదరాబాద్​లోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు 600 వెంటిలేటర్లు పంపించామని తెలిపారు. వైద్య సిబ్బందికి, కరోనా బాధితులకు ధైర్యం కల్పించేందుకే గాంధీ ఆస్పత్రికి వచ్చానని స్పష్టంచేశారు. గాంధీ ఆస్పత్రిలో 250పైగా వెంటిలేటర్లు ఖాళీగా ఉన్నాయని అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులను కట్టడి చేయాల్సన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గాంధీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని ఆదేశించారు. కోవిడ్ కు వ్యాక్సిన్ లేదని, ప్రజలే తమను తాము కాపాడుకోవాలని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి సూచించారు.