న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం సుఖాంతం అయ్యింది. సోమవారం మధ్యాహ్నం కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీని సచిన్ పైలట్, ఆయన వర్గం ఎమ్మెల్యేలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిమధ్య సానుకూల చర్చలు జరిగాయని.. తిరిగి కాంగ్రెస్ గూటికి రావడానికి సచిన్, ఆయనవర్గ ఎమ్మెల్యేలు ఒప్పుకున్నారని కాంగ్రెస్‌పార్టీ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. రాజస్థాన్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ఓ కమిటీని వేయనున్నట్టు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. రెబల్ ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు ఉండబోవని స్పష్టం చేసింది.
కారణం ఇదేనా..
బీజేపీ సరైన హామీ ఇవ్వకపోవడం, తన వద్ద కూడా కేవలం 18 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉండడంతో పైలట్ వెనక్కి తగ్గినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు సచిన్ డిమాండ్లకు రాహుల్‌గాంధీ సానుకూలంగా స్పందించారట. ఆగస్టు 14నుంచి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో సచిన్ పైలట్ మెత్తబడడం కాంగ్రెస్‌కు ఊరట నిచ్చే అంశమే.
సంక్షోభానికి ఇదీ కారణం..
రాజస్తాన్‌లో డిప్యూటీ సీఎంగా ఉన్న సచిన్ పైలట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు యత్నిస్తున్నారని సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. అంతేకాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సచిన్ బేరసారాలు చేస్తున్నారన్న ఆరోపణలపై ప్రశ్నించేందుకు రాజస్థాన్ పోలీసులతో ఏర్పాటు చేసిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ తో సచిన్ పైలట్‌కు నోటీసులు ఇప్పించారు. దీంతో సచిన్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. సీఎల్‌పీ సమావేశానికి గైర్హాజరయ్యారు. తన వర్గం ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని అజ్ఞాత ప్రాంతానికి వెళ్లారు. కాగా ఈ చర్యపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్ అయ్యింది. ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి పైలట్‌ను తొలగించింది. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పార్టీ ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు జరిపిందనేది కాంగ్రెస్ ప్రధాన ఆరోపణగా ఉండగా, ఆ ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది.