- ప్రధాని నరేంద్రమోడీ సంతాపం
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు జస్వంత్ సింగ్(82) కన్నుమూశారు. 2014 లో తలకు దెబ్బతగిలి గత ఆరేళ్లుగా కోమాలో ఉన్న ఆయన.. ఆదివారం ఉదయం ఢిల్లీలో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. రాజస్థాన్ లోని జోధ్పూర్ కు చెందిన జశ్వంత్ సింగ్.. బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. రాజకీయాల్లోకి రాకముందు పదేళ్ల పాటు ఆయన ఆర్మీలో సేవలందించారు. వాజ్ పేయి ప్రభుత్వంలో పలు కీలక హోదాల్లో మంత్రిగా పనిచేశారు. జోధ్పూర్ లో 1938 జనవరి 3న జన్మించిన ఆయన 1950 నుంచి 1960 వరకు ఆర్మీలో పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. పార్లమెంట్ లో ఎక్కువ కాలం కొనసాగిన నేతల్లో ఆయన ఒకరు.
1980 నుంచి 2014 వరకు ఆయన పార్లమెంట్ లో సభ్యుడిగా ఉన్నారు. లోక్ సభకు నాలుగు సార్లు, రాజ్యసభకు ఐదుసార్లు ఎన్నికయ్యారు. వాజ్ పేయి హయాంలో ఆయన ఫైనాన్స్, విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసి ప్రశంసలు పొందారు. జస్వంత్ మరణంపై ప్రధాని మోడీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ముందు సైనికుడిగా ఆ తర్వాత రాజకీయ నాయకుడిగా ప్రజలకు అపారమైన సేవ చేశారని కొనియాడారు. వాజ్ పేయి హయాంలో ఆయన కొనసాగిన మంత్రిత్వ శాఖలకు వన్నె తెచ్చారని కొనియాడారు. జశ్వంత్ మరణంపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందిస్తూ.. రక్షణ మంత్రితో పాటు వివిధ హోదాల్లో ఆయన దేశానికి చేసిన సేవలు మరువరానివని తెలిపారు.