సారథి న్యూస్, శ్రీకాకుళం, విజయనగరం: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రెండున్నర నెలల తర్వాత గుడి తలుపులు తెరుచుకోనున్నాయి.. రెండురోజుల పాటు ప్రయోగాత్మకంగా ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత, ఆధార్, సెల్ నంబర్ తదితర వివరాలను పరిశీలించి భక్తులను అనుమతించనున్నారు.. దేవాదాయశాఖ శ్రీకాకుళం జిల్లా సహాయ కమిషనర్ వై.భద్రాజీ శనివారం మార్గదర్శకాలు జారీచేశారు. భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్లు చేయాలని సూచించారు. భక్తులు కాళ్లు, చేతులు కడుక్కోవడానికి బక్కెట్లతో నీళ్లు, మగ్గులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచుతారు. జూన్ 8, 9వ తేదీల్లో స్థానిక భక్తులను అనుమతించి, 10వ తేదీ నుంచి ఇతర ప్రాంతాల భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. ప్రతిఒక్కరూ ఆధార్ కార్డు, గుర్తింపు కార్డుతో రావాలని సూచించారు. తీర్థప్రసాదాలు, శఠారి ఉండదన్నారు. పిల్లలు, గర్భిణులు, వృద్ధులను అనుమతించరు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు పులిహోరా, లడ్డూ ప్రసాదాలు విక్రయించబోమని ఈవో సూర్యప్రకాశ్ తెలిపారు. నిత్యాన్నదానం నిలిపివేసినట్లు ప్రకటించారు. భౌతికదూరం పాటిస్తూ సూర్యనమస్కాలు చేసుకోవాలని భక్తులకు సూచించారు. జలుమూరు మండలం శ్రీముఖలింగం, టెక్కలి మండలం రావివలసలోని ఎండల మల్లికార్జునస్వామి, పాలకొండకోట దుర్గమ్మతల్లి ఆలయాల్లోనూ ఏర్పాట్లు చేస్తున్నారు.
10 నుంచి పైడితల్లి దర్శనాలకు అనుమతి
ఈనెల 10 నుంచి పైడితల్లి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లి ఆలయం సోమవారం నుంచి తెరుచుకోనుంది. సోమ, మంగళవారాల్లో ముందస్తు ఏర్పాట్లను పరిశీలించనున్నారు. బుధవారం నుంచి నిర్ణయించిన సమయాల్లో భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..
ఆలయంలో క్యూలైన్ ను ప్రతి గంటకు ఒకసారి సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో శుభ్రంచేసి శానిటైజర్, డిస్‌ఇన్ఫెక్షన్ టన్నెల్ ఏర్పాటుచేస్తారు. టాయిలెట్ వద్ద లిక్విడ్ సోప్ ఉంచుతారు. భక్తులు మాస్కులు తప్పనిసరిగా కట్టుకోవాలి. దర్శనం సమయంలో ఆరు అడుగుల దూరం పాటించాలి. అంత్రాలయ దర్శనం, సటారి నిషేధిస్తారు. తీర్థం ఇవ్వడం ఇబ్బంది లేకుంటే కొనసాగిస్తారు. హుండీలు తెరిచి ఆదాయం లెక్కించడంలో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా చూస్తారు. ఎక్కువ హుండీలు ఉంటే అన్ని ఒకేసారి తెరవరు.. ఆదాయ లెక్కింపులో 20 మంది మించి ఉండకూడదు. సిబ్బంది విధులకు వచ్చేటప్పుడు ఆఫీసు, ఆలయం ముఖద్వారం వద్ద చేతులు శానిటైజ్ చేసుకోవాలి.
- June 7, 2020
- Top News
- ఆంధ్రప్రదేశ్
- ARASAVALLI
- PYDITALLI
- SRIKAKULAM
- అరసవల్లి
- కరోనా
- పైడితల్లి
- సూర్యనారాయణ స్వామి
- Comments Off on మోగనున్న గుడిగంట