–గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఆంక్షల సడలింపు
–విమానాలు, రైళ్లు, అంతరాష్ట్ర ప్రయాణాలు నిషేధం
- విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు బంద్
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మే17 వరకు మరోసారి లాక్ డౌన్ ను పొడగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. ఆయా రాష్ట్రాల్లో రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లను గుర్తించి వాటిపై ఆంక్షలను సడలించింది. దేశంలో విమానాలు, రైళ్లు, రాష్ట్రాల మధ్య రాకపోకలను నిషేధించింది.
రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు నిర్వహించకూడదని పేర్కొంది. జనం రద్దీగా ఉండే ప్రదేశాలైన హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, జిమ్ సెంట్లరు, స్విమ్మింగ్ పూల్స్, స్టేడియాలను మూసిఉంచాలని ఆదేశించింది. అన్ని ప్రార్థనా స్థలాలు, పబ్లిక్ ఈవెంట్లను రద్దు చేసుకోవాలని, అన్నిజోన్లలోని ఆస్పత్రుల్లో ఓపీ సేవలు అనుమతించుకోవాలని సూచించింది.
గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కొన్ని ఆంక్షలను సడలించింది. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని, వారానికి ఒకసారి రెడ్ జోన్లలోని పరిస్థితిని పరిశీలిస్తారని తెలిపింది. ఒకవేళ కేసులు తగ్గితే రెడ్ జోన్లను గ్రీన్ జోన్లుగా మార్చుతామని, గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతి జారీచేసింది. రాష్ట్రాల పరిధిలో బస్సులకు అనుమతినిచ్చింది. గ్రీన్ జోన్లలో ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు వ్యాపారాలు, ఆరెంజ్ జోన్లలో వ్యక్తిగత వాహనాలకు అనుమతినిచ్చింది. ఆరెంజ్ జోన్లలో కార్లలో ఇద్దరు ప్యాసింజర్లు, టూ వీలర్‌పై ఒక్కరే ఉండేలా చూసుకోవాలని సూచించింది. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో వ్యక్తిగత ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవని కేంద్రప్రభుత్వం స్పష్టంచేసింది.